India Alliance: ఇండియా కూటమికి కాంగ్రెస్ గండం.. ఇండియా కూటమి భవిష్యత్తుపై ఉదయిస్తున్న ప్రశ్నలు!
The Future of INDIA Alliance any Effected Maharashtra Election Results: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా, కాంగ్రెస్ నాయకత్వలో ఏర్పడిన ఇండియా కూటమి భవిష్యత్తుపై తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేయటం, ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాగా బలహీన పడటంతో 16నెలల నాడు ఇండియా కూటమి ఉనికిలోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకత్వంలో 25 పార్టీలు ఇండియా కూటమిగా ముందుకొచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేశాయి. దీనికి రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కొంతమేర ఉపయోగపడటం, పలు రాష్ట్రాల్లో బీజేపీ అంతర్గత వైరుధ్యాల మూలంగా గత లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా, జాతీయస్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడగలిగింది. కూటమి ఉనికిలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి పరాజయం పాలుకాగా, తెలంగాణ, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో మాత్రం ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ఓడిన హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలలో మంచి విజయావకాశాలున్నా..వాటిని గెలుపుగా మలచుకోవటంలో కాంగ్రెస్ వైఫల్యాలే ప్రధాన కారణాలుగా కనిపించటంతో ఇప్పుడు ఇండియా కూటమి మనుగడ మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నిరుటి జులై మాసంలో నాటి బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ చొరవతో జులై మాసంలో 16 పార్టీలు ఒకచోట సమావేశమై ఉమ్మడిగా బీజేపీ మీద పోరు సలపాలని నిర్ణయించాయి. అదే ఇండియా కూటమిగా రూపుదాల్చటం, అందులో కాంగ్రెస్ సహా 25 పార్టీలు చేరటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. కూటమి ఏర్పడేనాటికి నితీష్ కుమార్.. లాలూ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి భాగస్వామిగా ఉంటూ.. బీహార్ సీఎం బాధ్యతల్లో ఉన్నారు. పలు పార్టీలను తొలి సమావేశానికి ఒప్పించిన తానే ఇండియా కూటమికి కన్వీనర్ అవుతానని ఆయన ఆశించారు. అయితే, దీనికి కూటమిలోని పెద్దపార్టీ అయిన కాంగ్రెస్ ‘నో’ చెప్పటంతో నితీష్ కినుక వహించి, తన సీఎం పదవికి రాజీనామా చేసి, విపక్షంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి సీఎం గద్దెనెక్కి ఎన్డీయే పంచన చేరారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు యూపీలోని రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ కూడా ఇదే బాట పట్టింది. ఇండియా కూటమిలో పెద్ద కుర్చీఆశించిన మమత కూడా నెమ్మదిగా అంటీముట్లనట్లుగా ఉండటం ప్రారంభించింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో అడుగు ముందుకు వేసి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో నేరుగా తలపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూటమి తరపున పోరాడాలనే నియమాన్ని కాంగ్రెస్ గౌరవించకపోవటంతో ఈ 16 నెలల కాలంలో కొత్త పార్టీలేవీ ఇండియా కూటమిలో చేరలేదు. ఇండియా కూటమికి ఇది మరో మైనస్‌గా మారుతోంది.
ఇండియా కూటమి ఏర్పడినాటి నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభ తగ్గుతూనే వస్తోంది. గ్యారెంటీల హామీలు అనేది కర్ణాటక, తెలంగాణలో తప్ప మరెక్కడా సక్సెస్ కాకపోవటం, ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అదే పాట పాడటం కూడా ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గెలవటానికి మంచి అవకాశం ఉన్న ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రకటించిన హామీలు కర్ణాటక, తెలంగాణలో అమలు కావటం లేదనే బీజేపీ ప్రచారం కారణంగా తేలిపోయాయి. అటు.. హస్తం నేతలు తమ పార్టీ విజయం కన్నా సీఎం పదవిపై మక్కువతోనే పనిచేయడంతో కాంగ్రెస్ కూటమికి పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి బలపడాలంటే మిత్రపక్షాలపై.. కాంగ్రెస్ పెత్తనం తగ్గాలని, పొత్తు ధర్మాన్ని సరిగా నిర్వర్తించాలని కూటమిలోని పార్టీలు కోరుతున్నాయి. అదే విధంగా.. మూస పద్ధతిన 6 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు అని చేస్తున్న ప్రచారాన్ని ఆపి, ఆయా రాష్ట్రాలకు తగినట్లుగా క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ సామాజిక, ఆర్థిక విధానంతో ముందుకు రావాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే, ఆ రాష్ట్రంలోని పార్టీ వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తల మాటను పక్కనబెట్టి, విజయం కోసం ఎన్నికల వ్యూహకర్తలను నమ్ముకోవటమనే విధానానికి కాంగ్రెస్ స్వస్తి చెప్పాలని వారు స్పష్టం చేస్తున్నారు.
తాను బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో మిత్ర పక్షాన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తూనే, తనకు బలమున్న చోట మాత్రం మిత్ర పక్షాలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ వైఖరి తగదని కూటమిలోని పలు పార్టీలు వాపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో పంతంపట్టి మరీ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకొని, ఓడిపోయి, బీజేపీకి విజయాన్ని చేజేతులా అప్పగిస్తోందనేది వీరి ఆరోపణ. ఉదాహరణకు గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లు కావాల్సిందేనని పట్టుబట్టి తీసుకున్న కాంగ్రెస్ అక్కడ 19 సీట్లే గెలిచింది. మొన్నటి జమ్మూ-కశ్మీర్ ఎన్నికల్లో 90 సీట్లున్న అసెంబ్లీలో 37 సీట్లు ఇవ్వాల్సిందేనని మొండికేసి తీరా అక్కడ 6 సీట్లే గెలిచింది. అదృష్టవశాత్తూ 56 చోట్ల బరిలో నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గటంతో జమ్మూ కశ్మీర్ పీఠం ఇండియా కూటమి వశమైంది. అసలు తామే ఇంకొన్ని సీట్లు పోటీ చేసుంటే సొంతగా గెలిచేవాళ్లమని ఒమర్ అబ్దుల్లా ఫలితాల తర్వాత వాపోయారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ నిర్వాకం ఇదేనని పలుమార్లు సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ గొణుగుతూనే ఉన్నారు. తాజా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 101 సీట్లకు పోటీచేసి 16 సీట్లే గెలిచింది. జార్ఖండ్‌లో మాత్రం 30 సీట్లు తీసుకుని 16 సీట్లు గెలిచి ఫరవాలేదనిపించింది. కనుక, ఈ వైఖరిని కాంగ్రెస్ సమీక్ష చేసుకుని పద్ధతి మార్చుకోకపోతే, ఇండియా కూటమికి నష్టమే.
ఇదిలా ఉండగా, 2025 ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ, నవంబరులో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమికి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీ మధ్య త్రిముఖ పోరు ఉండగా, బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి వర్సెస్ ఆర్జేడీ-కాంగ్రెస్- వామపక్షాల కూటమి తలపడనున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ బలం పరిమితం కావటం, కేజ్రీవాల్ ప్రతిష్ట మసకబారటంతో ఈసారి ఆప్‌ను గద్దె దించటం ఖాయమని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. అటు బీహార్‌లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ ఓట్లు చీల్చటం ఖాయం గనుక తమకు మంచి విజయావకాశాలుంటాయని ఎన్డీయే లెక్కలు వేసుకుంటోంది. ఈ రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి ఏ మేరకు విజయం సాధిస్తుందనేది వేచి చూడాలి. అయితే, జమిలి ఎన్నికలే గనుక వచ్చి 2027లో సార్వత్రిక ఎన్నికలు జరిగితే, ఇండియా కూటమి ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప కూటమి సత్తా చాటే అవకాశాలు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలోపేతం మీద దృష్టి సారించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ రెండడుగులు వెనక్కి వేస్తేనే ఇండియా కూటమి ఒక అడుగు ముందుకు వేయటం సాధ్యమవుతుంది