Last Updated:

Odisha Train Accident : హృదయం ధ్రవించుకుపోయేలా ఒడిశా రైలు ప్రమాదం.. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగాయంటే?

ఒడిశా లోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

Odisha Train Accident : హృదయం ధ్రవించుకుపోయేలా ఒడిశా రైలు ప్రమాదం.. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగాయంటే?

Odisha Train Accident : ఒడిశా లోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా (Odisha Train Accident) పేర్కొంటున్నారు. కాగా గతంలో కూడా మన దేశంలో పలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా పదుల సంఖ్యలో రైల్వే ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. ఆయా ప్రమాదాలలో వందలాది మంది ప్రాణాలను కోల్పోగా.. వేలాది మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో భారత్ లో జరిగిన పలు రైలు ప్రమాదాల వివరాలు మీకోసం ప్రత్యేకంగా ..

ఛప్రా-మథుర ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

జూలై 7, 2011న ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా సమీపంలో ఛప్రా-మథుర ఎక్స్‌ప్రెస్ ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే క్రాసింగ్ వద్ద సరైనా సెక్యూరిటీ లేకపోవడం వల్ల తెల్లవారుజామున 1:55 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైలు అతివేగంతో నడుస్తుండడంతో బస్సును దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది.

ఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం

జూలై 30, 2012న నెల్లూరు సమీపంలో ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించారు.

గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

మే 26, 2014న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. తత్ఫలితంగా 25 మంది మరణించారు.50 మందికి పైగా గాయపడ్డారు.

జనతా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం

మార్చి 20, 2015న డెహ్రాడూన్ నుండి వారణాసికి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్‌బరేలీలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్ తో పాటు రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు.

ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

నవంబర్ 20, 2016న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ఘోర ప్రమాదంలో కనీసం 150 మంది ప్రయాణికులు మరణించగా.. 150 మందికి పైగా గాయపడ్డారు.

కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

ఆగస్టు 19, 2017న హరిద్వార్ నుంచి పూరి మధ్య నడుస్తున్న కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ రైలు ప్రమాదంలో 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, 97 మంది గాయపడ్డారు.

కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం

ఆగస్టు 23, 2017న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మందికి పైగా
గాయపడ్డారు.

బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

జనవరి 13, 2022న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.