Yatra Special: లోకేశ్ పాదయాత్ర, పవన్ బస్సుయాత్ర..
మరో మూడు నెలల తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయంగా ఆ ఇయర్ అందరికీ ఎంతో కీలకమే
Yatra Special: మరో మూడు నెలల తర్వాత కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయంగా ఆ ఇయర్ అందరికీ ఎంతో కీలకమే. ఏపీలో అయితే అధికార, విపక్షాలకు చాలా ముఖ్యమైన సంవత్సరం. మొత్తంమీద 2023 యాత్రా స్పెషల్ అని చెప్పవచ్చు.లోకేశ్ పాదయాత్ర, పవన్ బస్సుయాత్రతో వైసీపీ వ్యతిరేక ఓటును సంఘటితం చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు.
కొన్ని క్యాలెండర్ ఇయర్స్‌కి పొలిటికల్ వాల్యూ చరిత్రలో చాలా ఉంటుంది. 1982లో ఎన్టీఆర్ అలా ఒక చరిత్రను ఆ క్యాలండర్ ఇయర్ లో రాసిపెట్టారు. 2003లో వైఎస్సార్ పాదయాత్ర మరో రాజకీయ ముద్ర పడి ఏపీ జాతకాన్ని తారుమారు చేసింది. ఇక 2013లో చంద్రబాబు చెమటోడ్చి ఆరున్నర పదుల వయసులో పాదయాత్రని చేసి విభజన ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పారు. 2017 తీసుకుంటే జగన్ అలాంటి భారీ ఫీట్‌నే చేసి చూపించారు. ఇపుడు చూస్తే ఏపీలో, వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు అంటూ జగన్ ఎమ్మెల్యేలకు గట్టిగా చెబుతున్నారు. ఒక్క సీటు అయినా ఎందుకు ఓడాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అటు వివిధ అంశాలపై టీడీపీ, జనసేన, బీజేపీ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఎలాగైనా ఓడించాలని ప్లాన్ చేస్తున్నాయి.
ఇక.. 2023 సంవత్సరం వస్తోంది. ఇది 2024 ఎన్నికల ముందు రిహాల్సల్స్ లాంటి ఇయర్ అన్న మాట. ఎవరు సర్దుకున్నా ఇపుడే సర్దుకోవాలి. అలాంటి పొలిటికల్ ఇయర్ లోకి కొద్ది నెలల్లో అడుగుపెడుతున్న వేళ ఏమిటి ఏపీ రాజకీయ విశేషం అంటే చాలానే ఉంది అని చెప్పాలి.ఎలా అంటే 2023 మొదలవుతూనే టీడీపీ వారసుడు లోకేష్ భారీ పాదయాత్రకు నడుం బిగిస్తున్నారు. జనంలోకి వెళ్ళబోతున్నారు. వారి మధ్యనే ఏడాదిన్నర కాలం పైగా ఉండబోతున్నారు. ఒక విధంగా జనంతో ఉంటూ ఆయన వైసీపీతో తేల్చుకోబోతున్నారు. తనను తాను తీర్చిదిద్దుకోబోతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ పూర్తిగా మెరుగు కావడం ఖాయం. అలాగే ఆయన పాదయాత్రకు జనాల నుంచి మంచి స్పందన లభిస్తే కనుక అది వైసీపీకి డేంజర్ బెల్స్ మోగించినట్లే అని కూడా చెప్పాలి.అదే విధంగా జనాల ఆలోచనలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఒక విధంగా ఉంటే ఎన్నికల ఏడాదికి దగ్గరపడుతున్న వేళ మరో విధంగా ఉంటాయన్నది తెలిసిందే. అలా జనంలో ఉన్న వ్యతిరేక భావనను కనుక లోకేష్ వెలికి తీస్తే కచ్చితంగా అధికార వైసీపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది. ఇపుడు వైసీపీలో ఉన్నంత నెమ్మదితనం, ఫీల్ గుడ్ వాతావరణం అన్నది మాత్రం ఉండబోదు అని అంటున్నారు.
ఇక లోకేష్ పాదయాత్రతో పాటు పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఏడాది జూన్ నుంచి తన బస్సు యాత్రను మొదలుపెడతారు అని అంటున్నారు. పవన్ క్రౌడ్ పుల్లర్. పైగా సినీ చరిష్మా బాగా ఉన్న వారు. ఆయన జనంలోకి వచ్చి ప్రతీ పల్లెను టచ్ చేస్తూ వైసీపీ మీద విమర్శలు ఏకరువు పెడితే కచ్చితంగా మార్పు రావడం ఖాయం. ఇలా ఒక వైపు లోకేష్, మరో వైపు పవన్ జనంలో నిలిచి చెడుగుడూ ఆడుతూంటే కచ్చితంగా ఏపీలో జనం మూడ్ మారే చాన్స్ ఉంటుంది.అలాగే పొలిటికల్‌గా పోలరైజేషన్కి కూడా ఇది దారి తీసే అవకాశం ఉంది అంటున్నా రాజకీయ పరిశీలకులు. ఒక్కసారి కనుక వ్యతిరేకత అంటూ వస్తే దాన్ని ఆపడం మాత్రం వైసీపీ తరం కాదని కూడా చెబుతున్నారు. మరి జనంలో అంతటి వ్యతిరేకత ఉందా. దాన్ని పవన్, లోకేష్ వెలికితీసి వైసీపీకి చుక్కలు చూపిస్తారా అంటే విపక్ష శిబిరం మాత్రం అవును అనే అంటోంది. మొత్తానికి చూస్తే 2023 మాత్రం ఏపీ రాజకీయం గేర్ మార్చడం ఖాయమనే చెబుతున్నారు. అందులో సక్సెస్ అయితే ఏపీ రాజకీయ చరిత్రలో ఈ ఇయర్ కూడా గుర్తుండిపోతుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.