Published On:

Harish Rao: రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోంది : మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao: రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోంది : మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

Former Minister Harish Rao On Revanth Reddy : గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి వరంగల్‌కు తరలించారు. అరెస్టుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. కౌశిక్‌రెడ్డిపై పగతో దొంగ కేసు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. శనివారం, ఆదివారాల్లో అరెస్టు చేయొద్దని హైకోర్టు పలుమార్లు చెప్పినా లెక్కచేయకుండా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.


ఫార్ములా ఈ-కారు రేసును తెలంగాణకు తెచ్చిన కేటీఆర్‌‌ను కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. తెలంగాణలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే రేవంత్‌‌రెడ్డికి భయం అన్నారు. నిద్రలో కూడా కేసీఆర్ పేరు తలచుకొని భయపడుతున్నారని విమర్శించారు. సీఎం కుర్చీకి ఉన్న విలువను కూడా రేవంత్‌ తీస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం జిన్నారంలో పటాన్‌చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మీడియాతో మాట్లాడారు.

 

ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు.. కోతల రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ప్రతిరైతుకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు. రేవంత్‌ ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్న రెండు లక్షల ఎకరాలకు రైతుబంధు ఇవ్వటం లేదని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల రైతులపై రేవంత్‌ పగ పెంచుకున్నారని మండిపడ్డారు. ఎందుకు రైతుబంధు ఇవ్వటం లేదని నిలదీశారు. సాగులో ఉన్న భూములకు రైతుబంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

 

తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నారు. రైతుబంధు ఇవ్వకపోతే ఓఆర్ఆర్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో ఏ రైతును, పాఠశాల పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. రాష్ట్రంలో అందాల పోటీలు పెడితే ఏం జరిగిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: