Vande Bharat train: గోవిందుడి చెంతకు‘వందేభారత్’.. ఏప్రిల్ 8న ప్రారంభం?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
Vande Bharat train: త్వరలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు వందేభారత్ అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్లకు అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఈ సెమీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఏప్రిల్ 8 న ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహణపమైన ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని ఆదేశాలు వచ్చాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులు ప్రయాణిస్తుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు మూడు నాలుగువారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్ దొరికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలో ప్రారంభం?(Vande Bharat train)
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్-కర్నూలు, వికారాబాద్-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించేలా రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగతుంది.. ఛార్జీలు, ప్రయాణ సమయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదాన్ని తిరుపతిలో ప్రారంభించనున్నట్టు తెలిసింది.
ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. ఈ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం 12 గంటలుగా ప్రయాణ సమయం 6.30 గంటల నుంచి 7 గంటలకు తగ్గనుంది.
మూడు రైళ్ల రద్దు
శని, ఆదివారాల్లో విజయవాడ-గుంటూరు స్టేషన్ల మధ్య మూడు రైళ్లను రద్దు చేసినట్లు ఎస్‌సీఆర్ జోన్ అధికారులు తెలిపారు. అదేవిధంగా గుంటూరు-రేపల్లే రైలు పాక్షికంగా రద్దు చేయడంతో పాటు నర్సాపూర్-గుంటూరు రైలు తెనాలి మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.