Last Updated:

NIMS Hospital: నిర్లక్ష్యపు నీడలో నిమ్స్‌ ఆసుపత్రి

బెడ్ దొరకదు. స్ట్రెచర్ ఉండదు. అడుగడుగునా సమస్యలే. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి పరిస్థితి.

NIMS Hospital: నిర్లక్ష్యపు నీడలో నిమ్స్‌ ఆసుపత్రి

Hyderabad: బెడ్ దొరకదు. స్ట్రెచర్ ఉండదు. అడుగడుగునా సమస్యలే. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి పరిస్థితి. నిమ్స్‌ అంటే మెరుగైన వైద్యం, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చునని ఎందరో పేద, మధ్య సామాన్య వర్గాలలో నెలకొన్న అభిప్రాయం. ఇక్కడ క్లిష్టమైన వైద్యం చేసే వైద్య నిపుణులున్నారనే విశ్వాసం. కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లలేని ఎందరో నిమ్స్‌ కు వచ్చి చికిత్సలు చేసుకుంటారు. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తోంది నిమ్స్‌. ఒకవైపు అరకొర వైద్య సేవలు. మరోవైపు అపరిశుభ్రతతో నిండిన పరిసరాలు రోగులకు శాపంగా మారాయి. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి రోగికి పునర్జన్మ ప్రసాదించే ఎందరో నిష్ణాతులైన వైద్యులున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నిమ్స్‌ ప్రతిష్ట మంటగలుస్తోంది. నిజాం ట్రస్టు సహకారంతో ఏర్పడిన నిమ్స్‌ ప్రతిష్ట బజారుకెక్కుతోంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన నిమ్స్‌ ఎనిమిదేళ్లుగా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ నిర్వహణ లోపాల పై అనేక ఆరోపణలు వచ్చాయి. నిధుల దుర్వినియోగం, బిల్లింగ్‌, క్రెడిట్‌, రీసెర్చ్‌లో అవినీతి జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అప్పట్లో పెద్దగా ఫిర్యాదులు వచ్చేవి కావు. కానీ, ఇటీవలి కాలంలో నిమ్స్‌ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్‌ ఎమర్జెన్సీ విభాగంలో బెడ్‌ దొరకాలంటే గంటల కొద్దీ అంబులెన్స్‌లో నిరీక్షించాల్సిందే. కనీసం రెండు గంటలు గడిస్తే కానీ అక్కడ పడక దొరకడం గగనమే. ఒక బెడ్‌ ఖాళీ అయితేనే మరో రోగికి కేటాయించాల్సిన దుస్థితి ఏర్పడింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పాలైన నిమ్స్‌ డైరెక్టర్‌.. నిమ్స్‌లో కాకుండా మనోహర్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో పెద్ద దూమారమే రేగింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారి నిర్లక్ష్యమే నిమ్స్‌ దయనీయ పరిస్థితికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు అధిక విభాగాల సేవల పనితీరు మందకొడిగా తయారైంది. ఇక్కడి పరిస్థితిని గమనించే అత్యవసర పరిస్థితిలో ఆయనే చికిత్స కోసం మరో కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాకర్ల సుబ్బరావు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన ఉదయమే 8 గంటలకు ఆస్పత్రికి వచ్చి రౌండ్స్‌కు వెళ్లే వారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, లోపాలు, ఫిర్యాదులపై సమీక్షించేవారు. దీంతో వైద్యులు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండే వారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లు కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. ఔట్‌ పేషంట్ల క్లినిక్‌ కూడా ఉదయం 8 గంటలకే తెరుచుకునేది. డాక్టర్‌ మనోహర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆస్పత్రి పనితీరు మందగించిందనే అపవాదు మూటగట్టుకున్నారు. నిమ్స్‌లో వైద్యం పొందాలంటే నరకమే అన్నట్లుగా పరిస్థితి మారింది. గంటల తరబడి లైన్లో నిలబడినా, ఒక్కోసారి ఓపీ దొరకడం కష్టమే. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నా, నివేదికలు పొందాలన్నా రోజులు, వారాలు తిరగాల్సిందే. శస్త్రచికిత్సలు అవసరమైన వారూ నిరీక్షించాల్సిందే. ఓపీలో గతంలో ఉదయం 8 గంటలకు కనిపించే సీనియర్‌ వైద్యులు ఇప్పుడు ఉదయం 10 తర్వాతే కనిపిస్తున్నారు. జూనియర్‌ వైద్యులే రోగులను పరీక్షిస్తున్నారు. వీఐపీలు మాత్రమే ఇక్కడ త్వరితగతిన వైద్యం పొందగలుగుతున్నారు. డైరెక్టర్‌ రౌండ్స్‌ వేయడం మానేయడంతో కొన్ని విభాగాల నర్సింగ్‌ కేర్‌ కుంటుపడింది. పక్కనే కొత్తగా వెలిసిన కార్పొరేట్‌ ఆస్పత్రి, డయాగ్నోస్టిక్‌కు చెందిన బోర్డులు నిమ్స్‌ గోడలకు తగిలించినా అడిగే వారు లేరు.

మరోవైపు రోగులు అనేక రకాల సమస్యలతో ఎమర్జెన్సీకి వస్తున్నారు. కొందరిని స్ట్రెచర్లపైనే గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగులను సర్జికల్‌, మెడికల్‌, క్రిటికల్‌, న్యూరో, కార్డియాలజీ ఇలా అనేక విభాగాలకు వెంట వెంటనే తరలించాలి. ఏ వైద్యుడు ముందు చికిత్సలు అందించాలనే అంశం పై ఆ విభాగ సిబ్బందికి వెంటనే స్పష్టత రాకపోవడంతో రోగులు స్ట్రెచర్ పైనే గంటల తరబడి ఉంటున్నారు. ఆస్పత్రి వర్గాల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ దుస్థితికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు పైరవీ ఉంటేనే ఎమర్జెన్సీలో బెడ్స్‌ కేటాయిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇలా నిర్లక్ష్యపు నీడలో నిమ్స్‌ కొట్టుమిట్టాడుతున్నట్లు అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి: