Last Updated:

Pawan kalyan: ‘మనపై కుట్రలకు పాల్పడుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి’.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ లేఖ

జనసేన నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ఏపీలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏవిషయం గురించైనా మాట్లాడే

Pawan kalyan: ‘మనపై కుట్రలకు పాల్పడుతున్నారు.. జాగ్రత్తగా ఉండండి’.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ లేఖ

Pawan kalyan: జనసేన నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) దిశా నిర్దేశం చేశారు. ఏపీలో జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏవిషయం గురించైనా మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు బహిరంగ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ లేఖలో ఏం ప్రస్తావించారంటే..

కుట్రలకు పాల్పడుతున్నారు

 

ప్రియమైన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించడానికి, మన భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయి. వాటిని అర్ధం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సి ఉంది. మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి. వారి సూచనలు, సలహా మేరకు మాట్లాడండి.

 

వాస్తవాలు నిర్ధారించుకున్న తర్వాతే..(Pawan kalyan)

పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. కనుక ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం అనుకోని విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి. అది పార్టీకి, సమాజానికి కూడా మంచిది కాదు.

నన్ను విమర్శించే వారికీ, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో కూడా నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాను. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుంది. ఆ బలం అపసవ్యంగా మారకూడదు. నేనంటే ఇష్టంలేని వారికి కూడా శుభ సమయాలలో వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేస్తుంటాను కదా! ఇలా చేయడం అంటే సమాజంలో సమతుల్యత, సృహుద్భావం నెలకొనాలనే విషయాన్ని మరిచిపోవద్దు.

 

ముఖ్యంగా ఈ విషయాలను మరిచిపోకండి(Pawan kalyan)

– సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి.
– కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడకండి.
– పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా.
– మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లో చిన్న చితకా నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుడి వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు. ’ అని పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.