Last Updated:

మేడ్చల్: మంత్రి మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేల గుస్సా.. ఎందుకంటే..?

మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్న వార్తలు పార్టీలో కలకలాన్ని సృష్టించాయి.

మేడ్చల్: మంత్రి మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేల గుస్సా.. ఎందుకంటే..?

Medchal District: మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారన్న వార్తలు పార్టీలో కలకలాన్ని సృష్టించాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి…ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తాజాగా భేటీ అయ్యారు. మైనంపల్లి ఇంట్లో వారు భేటీ అయ్యారు. అయితే మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరికి నిరసనగానే వారు కలిశారని తెలుస్తోంది. ముఖ్యంగా ప‌ద‌వులు, అభివృద్ధి విష‌యాల్లో మంత్రి మ‌ల్లారెడ్డి ఒంటెత్తు పోక‌డ‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌.

స్థానికంగా త‌మ వాళ్లు ప‌ద‌వులు ఆశిస్తున్నార‌ని, కానీ మ‌ల్లారెడ్డి అన్నీ త‌న నియోజ‌క‌వ‌ర్గానికే తీసుకెళుతున్నార‌నే ఆరోప‌ణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి వస్తుంది. తాజాగా మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మార్పుపై ఈ భేటి జరిగిందని సమాచారం. ఇప్పటి వరకూ కుత్బుల్లాపూర్‌కి చెందిన రవి యాదవ్‌ను తప్పించి మేడ్చల్‌కు చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించడంతో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం సాగింది. జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో తలదూరుస్తున్నారని వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జిల్లా పదవులను మల్లారెడ్డి ఆయన అనుచరులకే ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ భేటీ అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యేలు.. తమ నియోజవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లోని నాయకులకు ఆశించిన పదవులు రావడం లేదని.. పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గం నేతలకే వెళ్తున్నాయని ఆరోపించారు. భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు తాము రాలేకపోయామని.. అందుకే ఈరోజు బ్రేక్ ఫాస్ట్ కోసం కలిశామని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలం ఈ సమావేశానికి వచ్చామని తెలిపారు. నియోజవర్గాల్లో అభివృద్ది, పార్టీ పరిస్థితిపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్టుగా తెలిపారు. తమ నియోజకవర్గాలలో ఆశించిన పదవులు రాకపోవడంతో నాయకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పార్టీ కష్టపడి పనిచేసేవారికి పదవులు దక్కడం లేదని.. దీంతో వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి తమను పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేలంతా ఒకమాటపైనే ఉన్నామని చెప్పారు. ఇక, మార్కెట్ కమిటీల విషయంలో మంత్రి మల్లారెడ్డి తొందరపడి జీవో ఇప్పించారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు పలువురు పదవులు ఆశలు పెట్టుకున్నారని అన్నారు. తాము కూడా కొందరికి కమిట్‌మెంట్స్ ఇచ్చామని.. కానీ పదవులన్నీ ఒకే నియోజకవర్గానికే తరలివెళ్తున్నాయని చెప్పారు. అక్కడ ఎందుకు పదవులు వస్తున్నాయి.. ఇక్కడ ఎందుకు రావడం లేదని కార్యకర్తలు అడిగే పరిస్థితి ఉందన్నారు. ఈ అంశాలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

మంత్రికి వ్యతిరేకంగానే కాదు.. బీఆర్ఎస్‌లో తాము అసంతృప్తిగా ఉన్నామ‌నే సందేశాన్ని, సంకేతాల్ని బీజేపీకి పంపిన‌ట్టు తెలుస్తోంది. అంటే తమ డిమాండ్లని గాని పట్టించుకోకపోతే ఎలాంటి నిర్ణయమైన తీసుకునేలా ఉన్నారు. మరి సీఎం కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి: