Cotton Wick Making Machine Scam: దీపంవత్తుల మెషిన్ల పేరుతో రూ.250 కోట్లు కొల్లగొట్టాడు..
హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో రూ.250 కోట్ల భారీ స్కాం బయటపడింది.
Hyderabad News: హైదరాబాద్ ఏ.ఎస్.రావు నగర్లో రూ.250 కోట్ల భారీ స్కాం బయటపడింది. ఆర్.ఆర్ ఎంటర్ ప్రెస్ ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన రమేష్ రావు అనే వ్యక్తి. వత్తుల మెషీన్లు పేరు చెప్పి సుమారు రూ.250 కోట్ల వరకూ మోసం చేశాడు. ఈ వ్యవహారంలో సుమారు 1500 మంది వరకు మోసపోయినట్లు తెలుస్తోంది.
రమేష్ రావు ఈ మెషిన్లకోసం ఒక్కొక్కరి వద్ద నుండి 5 నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తెలంగాణ, ఏపితోపాటు ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు రమేష్ రావ్ మెషిన్లు అమ్మాడు. దీనితో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చాలామంది మోసపోయారు. వత్తుల మెషీన్లు ఇచ్చాక దూది వత్తులు తయారు చేసి ఇచ్చిన బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రమేష్ రావు తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు.
డబ్బులు అడిగితే నేడు, రేపు అంటూ ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితులు మండిపడ్డారు. బాధితులందరూ నిలదీయడంతో వెనక దారి గుండా తప్పించుకుని పరారయ్యాడు రమేష్ రావు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.