Avanthi Srinivas: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన వాయిదా వేసుకోవాలి.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని మాజీమంత్రి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.
Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని మాజీమంత్రి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ వద్దు అమరావతి ముద్దు అంటూ ఉత్తరాంద్ర ప్రజలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదని అవంతి మండిపడ్డారు. రాష్రం అంటే కేవలం 29 గ్రామాలే కాదు మొత్తం రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోవాలని అవంతి అన్నారు. ఈ నెల 25 వికేంద్రీకరణకు మద్దతుగా మీకు సభ పెడుతుంటే అదే పవన్ కళ్యాణ్ విశాఖలో మీటింగ్ లు పెట్టడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన వాయిదా వేసుకోవాలని అవంతి డిమాండ్ చేశారు.
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో గోడ పత్రికను జేఏసీ నాయకులు, వైసీపీ మంత్రులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. మూడు రాజధానులు రాకుండా కుట్రలు చేస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. విశాఖ కార్యనిర్వహక రాజదానికి మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
డైవర్సన్ పాలిటిక్స్..
ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఐదుకోట్లమంది ప్రజలకు వారి ఆకాంక్షను తెలియజేసుకునే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు పవన్ డైవర్సన్ పాలిటిక్స్ చూస్తున్నారని అన్నారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని దాడిశెట్టి రాజా సవాల్ చేసారు.