Sandhya Theatre Stampade: సంథ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్‌ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించాడు. ఇప్పటికే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. తాజాగా సుకుమార్ కూడా శ్రీతేజ్‌ను పరామర్శించారు.
అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటంబ సభ్యులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు శ్రీతేజ్ తండ్రికి ఆర్థిక సహాయం కింద సుకుమార్ భార్య తబిత రూ.5 లక్షలు అందించినట్లు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందు భారీ స్థాయిలో బెన్‌ఫిట్, పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. దీంతో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి సంధ్య థియేటర్‌కి వచ్చాడు.
దీంతో తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులంత ఎగబపడటంతో థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సంధ్య థియేటర్ యాజమాన్యంపై, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులు సంధ్య థియేటర్ యజమానిని, ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత గతవారం అల్లు అర్జున్ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఒక్క రాత్రి జైలులో బన్నీ మరుసటి రోజు తెల్లవారుజామున బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చాడు.