Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డి భార్యపై ఈడీ నజర్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. అరబిందో ఫార్మా డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి.. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలను కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. అరబిందో ఫార్మా డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి.. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలను కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది. జెట్ సెట్ గో పేరుతో ప్రైవేట్ జెట్ చార్టర్ సర్వీసులను కనికా రెడ్డి నడుపుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన నగదును.. కనికారెడ్డి విమానాల్లోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
కనికారెడ్డి కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, అందులో ప్రయాణించిన వారి వివరాలన్నింటినీ ఇవ్వాలంటూ గత నెల 17న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి ఈడీ రాసిన లేఖ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇచ్చిన ఆధారాలతోనే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కనికారెడ్డి విమానాల్లో కవితతో పాటు పలువురు నేతలు ప్రయాణించినట్లు ఏఏఐ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్‌లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది.