AP: ఐదేళ్లలో జగన్ ఒక్క అభివృద్ధి పని చేయలేదు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu Comments: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటూ వ్యాఖ్యలు చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తల్లి, చెల్లితో ఇంట్లో గొడవైనా.. జగన్ మమ్మల్ని నిందిస్తున్నారన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా తల్లి, చెల్లిని రోడ్డుకు లాగి మా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి గొడవతో తమకు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి ఇవ్వటానికి తల్లి, చెల్లికి కండిషన్స్ పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అన్నారు.
ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని తాను ఊహించలేదని, ఇవేం చిల్లరరాజకీయాలని విమర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చారని, అమరావతిని స్మశానం చేశారంటూ గత ప్రభుత్వ పాలనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 వేల ఎకరాల భూమిని పైసా తీసుకోకుండా రైతులు రాజధాని కోసం ఇస్తే వాళ్ల బాత్రూంలపై డ్రోన్లు ఎగరేశారన్నారు. అబద్ధాల ప్రచారం చేస్తూ జగన్ పరదాలు కట్టుకుని తిరిగారన్నారు. గత ఐదేళ్ల రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదన్నారు. అసలు సచివాలయంలో జగన్ ఎప్పుడైనా కుర్చున్నారా? రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్త పోగు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు.