Bandi Sanjay Kumar comments Congress govt won’t fulfill promises: ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ధరణిపై కమిటీ, హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీలతో కమిషన్లు వేసి టైమ్ పాస్ చేస్తున్నారని కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు.
ఇవి.. వికృత ఉత్సవాలు..
ఏడాది పాలనపై రేవంత్ ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఊరూరా సభలు పెట్టటంపై సంజయ్ మండిపడ్డారు. ఏం సాధించారని ఈ విజయోత్సవాలని నిలదీశారు. ఏ ఏడాది కాలంలో సర్కారీ హాస్టళ్లలో పేద పిల్లలకు మంచి తిండి కూడా పెట్టలేకపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో హాస్టళ్లలోని పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నవి విజయోత్సవాలు కాదని, అవి.. వికృత ఉత్సవాలని మండిపడ్డారు. కాంగ్రెస్ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని, వారి చావులు ఉత్సవమన్నారు. ఇకనైనా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని బండి సంజయ్ కోరారు.
యుగాలు గడిచినా అంతే..
రేవంత్ తన ఏడాది పాలనలో ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తి పరచలేకపోయారని, సబ్బండ వర్ణాలూ ఈ సర్కారు మీద చీకాకు పడుతున్నాయన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాంగ్రెస్ పాలన పది యుగాలు సాగినా, తెలంగాణ ఒక్క అడుగు ముందుకు వేయలేదని వ్యాఖ్యానించారు. సావులు, కన్నీళ్లే కాంగ్రెస్‌కి కలకాలం నడిచే మార్గమని విమర్శించారు.
ఏడాదిపాలనపై చార్జిషీట్..
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ 6 అబద్ధాలు.. 66 మోసాలు’ పేరుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్జిషీట్ విడుదల చేశారని, దాంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్లపాటు నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగించిన గులాబీ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయంగా వచ్చిన కాంగ్రెస్ అదే బాటలో నడుస్తోందన్నారు.
7న నగరంలో జేపీ నడ్డా సభ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో తెలంగాణకు జరిగిన నష్టాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 7న నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్లు అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. దీంతో సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రజలకు చాటేందుకు బీజేపీ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు హైడ్రా, మూసీ బాధితులు హాజరయ్యేలా టీ బీజేపీ ప్లాన్ చేస్తోంది.