Formula E race: కేటీఆర్‌ అరెస్ట్‌కు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం.. ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే ఛాన్స్!

Congress Govt Getting Ready To Arrest On KTR In Formula E Race Case: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగంపై ఊగిసలాటకు తెరపడడంతో పాటు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. ఇక, ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురిని విచారణకు పిలువనున్నారు. ఈ మేరకు ఈ ఫార్మాలా రేసులో నిధులు దుర్వినియోగంపై ఇవాళ ఏసీబీకి ప్రభుత్వం లేఖ పంపనుంది. ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే సీఎస్ నుంచి లేఖ అందగానే ఏసీబీ కేసు నమోదు చేయనుంది. నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ అనుమతి తీసుకోగా.. తాజా పరిణామాలపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. ఇందులో భాగంగానే ఈ ఫార్ములా కారు రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారో లేదో తనకు తెలియదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఏ బాంబ్ అనేది త్వరలోనే తేలుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కారు రేస్‌కు సంబంధించి అన్ని అంశాలను కేబినెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై విచారణకు కూడా అనుమతి ఇచ్చారు. అయితే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.