Minister Ponguleti Srinivas Reddy: ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.. ధరణి ఇకపై ‘భూ భారతి’

Minister Ponguleti Srinivas Reddy Introduced Bhu Bharati Bill: తెలంగాణ అసెంబ్లీలో రికార్డు ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ చట్ట సవరణ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ధరణి పోర్టల్‌ను భూ భారతి గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్ఓఆర్ 2020 చట్టం రద్దు అవుతోంది.

కొత్త చట్టం ప్రకారం.. భూ సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రతీ భూ కమతానికి భూదార్ నంబర్ ఇవ్వనుంది. అంతేకాకుండా గ్రామకంఠ స్థలాలకు ప్రభుత్వం హక్కులు కల్పిస్తుంది. కాగా, కొత్త ఆర్ఓఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టంను తీసుకొచ్చామన్నారు. అయితే బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములను దోచుకున్నారని, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పొంగులేటి వెల్లడించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిని వదలమని పొంగులేటి అన్నారు. 2014కు ముందు ప్రభుత్వ భూమి అని రికార్డు అయిన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చిందన్నారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం.. ధరణిని బంగాళాఖాతంలో పడేశామన్నారు. కొత్త చట్టంలో సీక్రెట్ ఏమీ ఉండదని వివరించారు. సర్వే నంబర్ ఎంటర్ చేసి ఎవరైనా వివరాలన్నీ చూడొచ్చన్నారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించేలా కొత్త చట్టం రూపొందించామన్నారు. చట్టంలో భూదార్‌ను పొందుపర్చామని, ఆధార్ తరహాలో భూదార్ పనిచేస్తుందని వెల్లడించారు. దీనిపై సభ్యులు సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు.