Last Updated:

China: చైనాలో చేపలు, పీతలకు కరోనా పరీక్షలు

కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు.

China: చైనాలో చేపలు, పీతలకు కరోనా పరీక్షలు

China: కరోనాకు పుట్టినిల్లు చైనా. ప్రపంచమంతా ప్రజలు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే చైనాను కరోనా ఇంకా వదల్లేదు. ఇప్పటికి చైనీయులు వణికిపోతూనే ఉన్నారు. జీరో టాలరెన్స్‌తో కరోనాను అదుపు చేస్తున్నారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంతంలోని లక్షల మందిని ప్రజలు క్వారంటైన్‌లో ఉంచి,  ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా చైనాలోని జియామెన్‌ నగరంలో కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో అక్కడి 50 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలను మనుషులకు మాత్రమే పరిమితం చేయకుండా, సీఫుడ్‌లోనూ వైరస్‌ను పరీక్షించే పనిలో పడ్డారు అధికారులు. చేపలు, పీతలకు కూడా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు.

పీపీఈ కిట్టు ధరించిన వైద్య సిబ్బంది చేపలు, పీతలకు పీసీఆర్‌ విధానంలో కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలను సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ట్విటర్‌లో పంచుకుంది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు అక్కడి సోషల్‌ మీడియాల్లో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ చర్యను కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్థిస్తున్నారు. వాటిల్లో కరోనా ఉందో, లేదో తెలుసుకునేందుకు టెస్టులు కాకుండా మరే ఇతర మార్గం లేదు అని ఓ వర్గం చెబుతుండగా, అదే సమయంలో అతి జాగ్రత్తతో ఈ తరహా పరీక్షలు చేస్తూ ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మరో వర్గం విమర్శిస్తోంది. ఇదో పిచ్చిపని అని అధ్యక్షుడు, అధికార యంత్రాంగానికి పిచ్చిపట్టినట్లుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదిలా ఉండగా సీఫుడ్‌కు కరోనా పరీక్షలను జియామెన్‌ నగర అధికారులు సమర్థిస్తున్నారు. ఇలా తాము మాత్రమే చేయడం లేదని, వైరస్‌ వ్యాప్తితో వణికిపోయిన హైనన్‌ నగరం నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెబుతున్నారు. కొవిడ్‌ నివారణ చర్యలను చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఇతర దేశాలకు చెందిన మత్స్యకారులతో కలిసే అవకాశం ఉందని, వారంతా సముద్రంలోకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత కచ్చితంగా పరీక్షలు చేసుకోవాల్సిందేనని ఆదేశాలున్నాయి. వారు తీసుకొచ్చిన సీఫుడ్‌ను కూడా పరీక్షించాలని నిబంధనలు చెబుతున్నాయని వారు ప్రభుత్వం రూల్‌ బుక్స్‌ను చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి: