ఫిఫా ప్రపంచ కప్ 2022 : ఒక ఫిఫా ప్రపంచ కప్… 10 క్రికెట్ వరల్డ్ కప్స్‌కి సమానం… ఎందుకంటే?
ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కువ ఆదరణ కలిగినవి అంటే ముందుగా గుర్తొచ్చేవి ఫుట్‌బాల్, క్రికెట్ అని చెప్పాలి. అయితే క్రికెట్ తో పోలిస్తే
Fifa World Cup 2022 : ప్రపంచ వ్యాప్తంగా క్రీడల్లో ఎక్కువ ఆదరణ కలిగినవి అంటే ముందుగా గుర్తొచ్చేవి ఫుట్‌బాల్, క్రికెట్ అని చెప్పాలి. అయితే క్రికెట్ తో పోలిస్తే ఫుట్‌బాల్ కి క్రేజ్ ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలలో ఫుట్‌బాల్ ని ఆదరిస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే ఆటను ప్రారంభించింది ఇంగ్లాండ్ లోనే అయినప్పటికీ… ఆసియా, ఆఫ్రికా, ఆస్టేలియా ఖండాలలో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. ఇక ఫుట్‌బాల్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అందుకు ఉదాహరణగా మన దేశాన్ని చెప్పుకోవచ్చు. ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ ఫుట్‌బాల్ కి లేదు.
అయితే క్రికెట్ కి ఇంతటి క్రేజ్ ఉన్నప్పటికీ ఒక విషయం గమనిస్తే… ఫుట్ బాల్ తో అసలు క్రికెట్ ఏ విధంగానూ పోటీపడలేదని అర్దం అవుతుంది. ఆ విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారా… అదే “వరల్డ్ కప్ ప్రైజ్ మనీ”. 10 క్రికెట్ వరల్డ్ కప్ లకు ఇచ్చే ప్రైజ్ మనీ అంతా కలిపిన కూడా… ఒక ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కి సమానం కాదని రుజువు అవుతుంది. ఈ విషయాన్ని ఆయా అసోసియేషన్ లు అధికారికంగా ప్రకటించిన వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ ని చూస్తే తెలుస్తుంది.
తాజాగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో జరిగిన పోరులో అర్జెంటీనా ఫ్రాన్స్‌తో జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. అందుకు గాను ఈ జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కినట్లు తెలుస్తుంది. విజేత జట్టు నుంచి గ్రూప్ దశలో ఆడే జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం…
ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రైజ్ మనీ వివరాలు…
ఫిఫా వరల్డ్ కప్ 22వ ఎడిషన్‌లో మొత్తం $440 మిలియన్ల ( దాదాపు 36,35,45,60,000 భారత కరెన్సీ ) ప్రైజ్ మనీని పంపిణీ చేయనున్నారు. ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా 42 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 348 కోట్ల 48 లక్షలు) అందుకుంది. అలానే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.248 కోట్ల 20 లక్షలు) లభించాయి. ఇక మిగిలిన జట్లకు… మూడవ నంబర్ జట్టుకు $27 మిలియన్లు (సుమారు రూ. 220 కోట్లు) ఇవ్వనున్నారు. మూడో స్థానం కోసం మొరాకో, క్రొయేషియా డిసెంబర్ 17న తలపడనున్నాయి. అదే సమయంలో, నాల్గవ నంబర్ జట్టుకు 25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 204 కోట్లు) దక్కనున్నాయి.
అదే విధంగా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్న జట్లకు 17 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 138 కోట్లు) ఇవ్వనున్నారు. ఆ తర్వాత 9 నుంచి 16 నంబర్‌లో ఉన్న జట్లకు $ 13 మిలియన్లు (దాదాపు రూ. 106 కోట్లు) ఇవ్వనున్నారు. అదే సమయంలో, 17 నుంచి 32 స్థానాల్లో ఉన్న జట్లకు బహుమతిగా $ 9 మిలియన్లు (దాదాపు రూ.74 కోట్లు) ఇవ్వనున్నారు. విశేషమేమిటంటే, 2018లో ఆడిన ప్రపంచకప్‌లో విజేత ఫ్రాన్స్‌కు 38 మిలియన్ డాలర్లు (సుమారు రూ.314 కోట్లు) అందించారు. మరోవైపు రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాకు 28 (దాదాపు రూ. 231 కోట్లు) మిలియన్ డాలర్లు అందించారు.
టీ20 వరల్డ్ కప్ 2022 ప్రైజ్ మనీ వివరాలు…
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అన్ని జట్లకు ప్రైజ్ మనీ అందించేందుకు ఐసీసీ మొత్తం 5.6 మిలియన్ డాలర్లు (రూ. 45.68 కోట్లు) ఖర్చు చేస్తోంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ కింద 1.6 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 13 కోట్ల రూపాయలు. రన్నరప్ టీమ్ (ఫైనల్‌లో ఓడిపోయిన జట్టు) 8,00,000 డాలర్లను (రూ.6.5 కోట్లు) గెలుచుకుంది. ఇక సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన రెండు జట్లకు 4,00,000 డాలర్ల (రూ.3.25 కోట్లు) చొప్పున ఇచ్చారు. సూపర్ 12 దశ నుంచి వైదొలిగిన 8 జట్లకు 70,000 డాలర్ల చొప్పున అందించారు. టోర్నీ మొదలైన నాటి నుంచి కిందటి ఏడాది మాదిరి గానే ఒక్కో జట్టుకు ఒక్కో విజయానికి 40,000 డాలర్ల చొప్పున (రూ. 32 లక్షలు) ప్రైజ్ మనీ అందించారు.
దీని బట్టి చూస్తేనే ఫుట్ బాల్ కి, క్రికెట్ కి ఉన్న తేడా ఏంటా అనేది అర్దం అవుతుంది …