Shefali Jariwala: బాలీవుడ్ నటి షఫాలీ జరివాలా మృతిపై అనుమానాలు

Suspicions On Shefali Death: బాలీవుడ్ నటి, కాంటా లగా సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా (42) గుండెపోటుతో మృతిచెందింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన షఫాలీ జరివాలా కన్నుమూసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. షఫాలీ మృతికి అసలు కారణాలను పోలీసులు నిర్ధారించలేదు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్టు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షఫాలీ జరివాలాను ఆమె భర్త, నటుడు పరాగ్ త్యాగి, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. బెల్లేవ్ ఆస్పత్రి సిబ్బంది సమాచారం ప్రకారం షఫాలిని హాస్పిటల్ కు తీసుకువచ్చే సమయానికే ఆమె మరణించింది. ఈమె అంధేరిలోని ఆమె నివాసంలో ఉంటుంది. ఆమె మరణానికి గల కారణం ఇంకా తెలియలేదని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె అపార్ట్మెంట్ లో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ఘటనగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త పరాగ్ త్యాగి వాంగ్మూలాన్ని సేకరించామని చెప్పారు.
అయితే షఫాలీ జరివాలా అస్వస్థతకు గురికావడంతో నిన్న అర్ధరాత్రి ఆమె భర్త ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని నిర్ధారించలేదు. 2002లో వచ్చిన కాంటా లగా రీమిక్స్ సాంగ్ తో షఫాలీ జరివాలా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఆమెను కాంటా లగా గర్ల్ అని పిలిచేవారు.