Ashada Masam Importance: ఆషాఢ మాసం విశిష్టత ఏంటో తెలుసా..? ఈ మాసంలో తప్పక పాటించాల్సిన నియమాలివే..!

Importance of Ashada Masam: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో వచ్చే నాలుగో మాసం ఆషాఢం. అయితే ఎన్నో విశిష్టతలున్న నెలతో పాటు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన మాసం. ఆషాఢంలో మహావిష్ణువును పూజించడంతో పాటు దానధర్మాలు, యజ్ఞ యాగాలు చేస్తే మంచి ఫలితాలను వస్తాయని భక్తుల నమ్మకం. ఈ నెలలోనే ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసంలో గ్రామ దేవతలు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ వంటి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు.
అంతే కాకుండా ఈ నెలలో ఉత్తరాషాఢ, పుర్వాషాఢ నక్షత్రాలు వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తరాషాఢ, పుర్వాషాఢ నక్షత్రాల మధ్య కనిపిస్తాడు. ఈ మేరకు ఈ మాసాన్ని ఆషాఢ మాసంగా పిలుస్తుంటారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. అలాగే ఈ మాసంలో మహా విష్ణువుతో పాటు శివుడు, దుర్గామాత, హనుమాన్, సూర్యదేవుడు, అంగారకుడిని పూజిస్తారు. ఈ ఆషాఢ మాసం నేటినుంచి ప్రారంభబవుతోంది. అసలు ఆషాఢమాసం అంటే ఏమిటి.. అషాఢ మాసం విశిష్టతలు ఏంటో చూద్దాం.
ఆషాఢ మాసంలో యజ్ఞాలు చేస్తే మంచిదని పురోహితులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభంలోనే ఆషాఢమాసం వస్తున్నందున హవనం, యాగం నిర్వహిస్తారు. ఈ యాగం చేయడంతో హానికరమైన కీటకాలు ప్రకృతి నుంచి తొలగిపోతాయి. అంతేకాకుండా యాగాలు, యజ్ఞం చేయడంతో వాతావరణంలోని గాలి శుద్ధి జరుగుతుంది. ప్రధానంగా గొడుగు, మట్టి కుండ, ఉప్పు వంటి వస్తువులను దానం చేస్తే శుభం జరుగుతుందని అంటున్నారు. ఈ వస్తువులు అన్ని వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నందున పురోహితులు దానం చేయాలని చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఆషాఢ మాసంలో మహావిష్ణువును పూజించేందుకు మంచి సమయం. ఈ ఆషాఢ మాసంలో కొంతమంది నిత్యం గంగానదిలో పవిత్ర స్నానం, విష్ణు పూజ, తీర్థయాత్రలు వంటివి చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు.
ఇదిలా ఉండగా, పురాణాల ప్రకారం.. ఆషాఢ మాసంలో మహా విష్ణువు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడని చెబుతోంది. ఈ సమయంలో మహా విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడని, అందుకే శుభకార్యాలు నిర్వహించరని చెబుతుంటారు. అలాగే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేస్తారు. ఆ తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడంతో శారీరక బాధలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లి పూజలు చేయడంతో కాల సర్ప దోషం తొలగిపోతుందని పురోహితులు చెబుతుంటారు. ప్రధానంగా ఇలా చేస్తే శివుడి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. ఇలా గోరింటాకు మహిళలు శుభప్రదం అని, సౌభాగ్యం తీసుకొస్తుందని మహిళల నమ్మకం.