Aashada Bonalu: ఢిల్లీలో రేపటి నుంచి లాల్ దర్వాజ బోనాలు

Lal Darvaja Bonalu In New Delhi: ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈనెల 30 నుంచి జులై 2 వరకు వేడుకలకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది. ఈ మేరకు నిన్న ఓ ప్రకటన చేసింది. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.
జులై 1న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమం చేపట్టనున్నారు. చివరి రోజు పోతరాజులు, కళాకారుల నృత్యాలు ఉంటాయని కమిటీ వెల్లడించింది. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైతే ఢిల్లీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆ మొక్కు ప్రకారం.. గత పదేండ్లుగా ఏ లోటు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఢిల్లీలో ఉన్న తెలుగువారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే, ఈ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆలయ కమిటీ నేతలు ఆహ్వానం అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నేతలను ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కె. వెంకటేశ్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్ ఢిల్లీ తెలంగాణ భవన్ లో కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందించారు.