Published On:

TDP Mahanadu 2025: నేటి నుంచే టీడీపీ మహానాడు.. లోకేష్ కు కీలక బాధ్యతలు?

TDP Mahanadu 2025: నేటి నుంచే టీడీపీ మహానాడు.. లోకేష్ కు కీలక బాధ్యతలు?

TDP Mahanadu 2025 Starts from Today: కడప గడపలో మహానాడు నిర్వహించేందుకు అధికార టీడీపీ సిద్ధమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే కార్యక్రమానికి ఇప్పటికే అధినేత సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాలపై ప్రధానంగా చర్చ నిర్వహించనున్నారు. అనంతరం ఈ ప్రతిపాదనలను తీర్మానించనున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ కు మహానాడు వేదికగానే పార్టీ పగ్గాలు అందిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పార్టీలో కూడా డిమాండ్ వస్తున్నట్టు సమాచారం.

 

తొలిరోజు ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కానున్న ప్రతినిధుల సభలో లోకేష్ పార్టీ కార్యకలాపాలపై నివేదిక సమర్పించనున్నారు. అనంతరం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. పార్టీ లక్ష్యాలు, భవిష్యత్ కార్యచరణపై స్పష్టత ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

 

మహానాడులో ముఖ్యంగా మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభగా, మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారు. ఈసారి మహానాడు కార్యచరణ “కార్యకర్తే అధినేత”, “యువగళం”, “స్త్రీ శక్తి”, “సామాజిక న్యాయం”, “అన్నదాతకు అండ”, “తెలుగు జాతి- విశ్వ ఖ్యాతి” అనే ఆరు సూత్రాలపై చర్చలు జరిపి తీర్మానాలు చేయనున్నారు.