Heat Wave in North india: నిప్పుల కుంపటిగా మారిన ఉత్తర భారత దేశం
దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించి అడపాదడపా వర్షాలు కురుస్తుంటే... అదే ఉత్తరాదిన మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది.
Heat Wave in North india: దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించి అడపాదడపా వర్షాలు కురుస్తుంటే… అదే ఉత్తరాదిన మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. దీంతో ఉత్తరాదిన ఈ ఎండలకు చాలా మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఒక వైపు మండుటెండలు.. మరోవైపు నీటి కొరతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేశ చరిత్రలో ఢిల్లీలో గతంలో ఎప్పుడూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన దాఖలాల్లేవు. ఉత్తరాది రాష్ర్టాల్లోఈ ఏడాది సుదీర్ఘకాలం పాటు వేసవి కొనసాగింది. పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటిందని బీబీసీ కూడా వెల్లడించింది.
ఇక వడదెబ్బకు మృతి చెందిన వారి విషయానికి వస్తే యూపీ, ఒడిషా, మధ్యప్రదేశ్‌లలో కనీసం 33 మంది మృత్యువాతపడి ఉంటారు. గత శనివారం నాడు కాన్పూర్, బులంద్‌షహర్‌లలో 20 మంది చనిపోయారు. కాన్పూర్ ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలు, హమీర్‌పూర్‌లో 46.2 డిగ్రీలు, జాన్సీలో 46.1 డిగ్రీలు, వారణాసిలో 46 డిగ్రీలు, ప్రయాగ్రాజ్లు, ఆగ్రాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గత నెల 31 వరకు దేశంలోని వివిధ రాష్ర్టాల్లో వడదెబ్బకు 87 మంది మృత్యువాత పడ్డారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఒడిషాలో జూన్ 3 వరకు 141 మంది ఎండలకు మృత్యువాతపడ్డారు. వారిలో45 మంది వడదెబ్బ తగిలి చనిపోగా.. మిగిలిన వారు ఇతర కారణాల వల్ల చనిపోయారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈ నెల 3వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో 14 మంది చనిపోయారు.
ఎండలు.. నీటికొరత..(Heat Wave in North india)
ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ ఒక వైపు ఎండ వేడిమి.. మరో పక్క నీటి కొరతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాజధాని ఢిల్లీలో ట్యాంకర్లు వచ్చాయంటే ప్రజలు బకెట్లు పట్టుకొని నీరు తెచ్చుకోవడానికి క్యూ కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక నీటి సరఫరా విషయంలో ఇటు ఢిల్లీ ప్రభుత్వం , హర్యానా, హిమాచల్ ప్రదేశ్లు తరచూ వాదులాడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా యమునా నది ఎండలకు ఎండిపోతోంది.ఇక వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం లేకుండా పోతున్నట్లు లెక్క.
ఇదిలా ఉండగా దేశంలోని పలు రాష్ర్టాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ర్టాలకు విస్తరించాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందాలంటే ఢిల్లీ ప్రజలు మరికొంత కాలం ఆగాల్సిందేనని వాతావరణశాఖ వెల్లడించింది. ఇటీవలే వాతావరణశాఖ ఈ నెల 30 వరకు ఢిల్లీకి రుతుపవనాలు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది.