Spy Movie Review : యంగ్ హీరో నిఖిల్ “స్పై” మూవీ రివ్యూ.. హిట్ కొట్టినట్టేనా ?
Cast & Crew
- నిఖిల్ (Hero)
- ఐశ్వర్యా మీనన్ (Heroine)
- ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం, , సన్యా ఠాకూర్, మకరంద్ దేశ్ పాండే, జిష్షు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవి వర్మ తదితరులు (Cast)
- గ్యారీ బీహెచ్ (Director)
- కె. రాజశేఖర్ రెడ్డి (Producer)
- శ్రీచరణ్ పాకాల (Music)
- వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ (Cinematography)
Spy Movie Review : యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుస్తుంది. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంతకు ముందు క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథను కూడా అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తుండగా.. రానా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. కాగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..
సినిమా కథ..
రా ఏజెంట్ జై (నిఖిల్ ) విదేశాలు తిరుగుతూ శత్రువుల కుట్రలు ఛేదిస్తూ ఉంటాడు. అతని అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) సైతం ‘రా’ ఏజెంటే. అయితే… ఇప్పుడు ఆయన లేరు. ఇండియాకు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ఖాదిర్ ఖాన్ (నితిన్ మెహతా)ను సుభాష్ చంపుతాడు. ఆ తర్వాత సుభాష్‌ను ఎవరో చంపేస్తారు. తన అన్నయ్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని జై ప్రయత్నిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో అతనికి రా చీఫ్ శాస్త్రి (మకరంద్ దేష్ పాండే) ఓ పని అప్పగిస్తాడు. వాటిని ఛేజ్ చేసే పనిలో ఉండగా జై కి మరో విషయం తెలుస్తుంది. రా హెడ్ క్వార్ట్రర్స్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైల్ మిస్ అయ్యిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన పర్శనల్ ఎజెండా తన అన్నయ్యను చంపిన వారిని తెలుసుకుని పగ తీర్చుకోవటం. అలాగే అఫీషియల్ ఎజెండా నేతాజీ ఫైల్ ని వెనక్కు తీసుకురావడం. అలానే మరణించిన ఖాదిర్ మళ్ళీ ఎలా బతికాడు? ఇండియా ఎలా వచ్చాడు? సరిగ్గా అదే సమయంలో ‘రా’ హెడ్ ఆఫీసులో భగవాన్ జీ (సుభాష్ చంద్రబోస్) ఫైల్స్ మిస్ కావడం వెనుక ఎవరు ఉన్నారు? అని తెలుసుకోవడం.. ఇక ఈ స్టోరీ లో వైష్ణవి (ఐశ్వర్య మీనన్), ‘రా’ఆఫీసర్ అర్జున్ (రానా దగ్గుబాటి) లకు జై కి సంబంధం ఏంటి అనేది మూవీ స్టోరీ.
మూవీ రివ్యూ..
కొడితే కుంభస్థలం.. లేకుంటే అధః పాతాళం అన్నట్లు ఉంటది.. ఈ ఏజెంట్ సినిమాల వైఖరి. అడవి శేషు గూఢచారితో హిట్ కొడితే.. షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో బాక్సాఫీస్ ని ఊచకోత కోశాడు. కానీ ఈ తరహాలోనే వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు.. బోలెడు ఉన్నాయి. రీసెంట్ గానే ఏజెంట్ అంటూ వచ్చిన అఖిల్ కూడా ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులకు మంచిగా అంచనాలు ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా మూవీలో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించి టాపిక్ ఉండడంతో అంచనాలు మరీ పీక్స్ కి వెళ్ళాయి.
సుభాష్ చంద్రబోస్ 1945 లో విమాన ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ ప్రమాదంలో ఆయన చనిపోలేదని మిస్ అయ్యాడని .. ఆయన మరణం చుట్టూ చాలా మిస్టరీ ఉంది. ఈ విషయాన్నే పట్టుకుని తమ స్క్రిప్టులో తెచ్చామని మనకు ప్రమోషన్ లో మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అదే బ్యాంక్ చేసుకుని ఆ ఇంట్రస్టింగ్ విషయం ఏమిటో తెలుసుకుందామని మనం చూడ్డానికి వెళ్తాం. అయితే ఈ ఎలిమెంట్ సినిమాలో చిన్న పాయింట్ మాత్రమే. అది సమగ్రంగా ఉండదు. ఆ పాయింట్ ఎక్కడో సెకండాఫ్ లో వచ్చేదాకా వెయిట్ చేయాలి. మరో విషయం ఏమిటంటే..పబ్లిసిటీలో చేసినంత మేరకు కూడా ఆ పాయింట్ సినిమాలో ఉండదు. సుభాష్ చంద్రబోస్ గురించి ఏదన్నా చెప్తారేమో..ఆ సీక్రెట్స్ ఏమన్నా టచ్ చేసారేమో అని ఆశిస్తే మనకు నిరాశమిగులుతుంది. కేవలం పబ్లిసిటీ కు మాత్రమే సుభాష్ చంద్రబోస్ ని వాడారని అర్దమవుతుంది.
‘స్పై’ ఓ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడికి కలగడానికి కొంత సమయం పడుతుంది. మూవీలో యాక్షన్ సీన్లు సైతం నిదానంగా ముందుకు వెళుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కథలో సస్పెన్స్ & సెంటిమెంట్, లవ్ & యాక్షన్, కామెడీ.. అన్నీ ఉన్నా.. ఉత్కంఠ కలిగించే కథనం తక్కువైంది. ఇక కథలో లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ & డైరెక్షన్.. రెండు విభాగాల్లోనూ గ్యారీ బీహెచ్ ప్రభావం చూపించలేదు. యుద్దం రాబోతోందని, టెర్రరిస్ట్ మిస్సైల్స్ , ఇజ్రాయిల్ గూఢచారి వ్యవస్ద ‘మొసాద్’ గురించి ఇలా చాలా పెద్ద విషయాలు ప్రస్తావన తో మాట్లాడుతూంటారు. కానీ తెరపై జరిగేదంతా గల్లీ లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అసలు విలన్ ఎవరో తెలిసేటప్పటికే సినిమా మూడు వంతలు అయ్యిపోతుంది. ఆ విలన్ ని ఎదుర్కోవటం క్లైమాక్స్ బాగా రొటీన్ అనిపిస్తుంది.
ఇక ఎవరెలా చేశారంటే..
విభిన్నమైన కథ చేయాలని నిఖిల్.. ఈ సినిమాని ఓకే చేసినట్లున్నారు. అతను పాత్రకు న్యాయం చేసారు. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సెట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ పరిణితి కనపడుతుంది. రా చీఫ్ శాస్త్రిగా మకరంద్ దేశ్ పాండే కొత్తగా అనిపించాడు. ఐశ్వర్య మీనన్, అభినవ్, ఆర్యన్ రాజేష్ పాత్రలకు న్యాయం చేశారు. జిషు సేన్ గుప్తా, రవివర్మ, నితిన్ మెహతాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రానా ఉన్నది కొద్దిసేపే అయినా మంచి ఇంపాక్ట్ కలగ చేసారు. రానా ఉన్న కాసేపు మిగతా పాత్రలు నామ మాత్రమైపోయాయి. రానా మళ్లీ ఏ చివర్లో అయినా కనపడుతాడేమో అని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. ఛేజింగ్ సీక్వెన్స్ లు బాగా తీసారు. ఇక శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు, డైలాగులు బాగున్నాయి. ఇక ఇలాంటి సినిమాకు అవసరమైన సినిమాటోగ్రఫీ వర్క్ కుదిరింది. విఎఫ్ ఎక్స్ ఇంకాస్త క్వాలిటీ ఉండాలి. సబ్జెక్ట్ మీద మంచి రీసెర్చ్ చేసారు కానీ దాన్ని కథగా మార్చుకోవటంలో ఫెయిల్ అయ్యారు.
కంక్లూజన్..
కొంచెం ట్రైనింగ్ అవసరమైన “స్పై”