Parawada Pharma City: పరవాడ ఫార్మా సిటీలో మరోసారి ప్రమాదం..లీకైన విషవాయువు
Poisonous Gases At Parawada Pharma City: అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విషవాయువులు లీకయ్యాయి. రక్షిత డ్రగ్స్‌లో ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో విషవాయువు పీల్చిన నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆ నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైనట్లు గుర్తించారు. ఇందులో నలుగురు అస్వస్థతకు గురికాగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, గత కొంతకాలంగా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా లేబొరేటరీలో విషవాయువులు లీకైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో 9మంది తీవ్ర అస్వస్థత చెందారు.
దీంతో పాటు డిసెంబర్ 6న ఫార్మాసిటీలోని ఓ ఆర్గానిక్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కార్మికులు ప్రొడక్షన్ బ్లాక్ లో ఉన్న ప్రొడక్స్ తీసేందుకు డ్రయర్ యంత్రం వద్ద మ్యాన్ హోల్ తీశారు. దీంతో ఒక్కసారిగా కెమికల్స్ బయటకు రావడంతో ఇద్దరి కార్మికులకు గాయాలై స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ఇద్దరికి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.
అయితే, వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి చెందుతున్నారు. గతంలోనూ చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గత పదేళ్లుగా ఎక్కడోచోట ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అచ్యుతాపురం, పరవాడ, రాంబల్లిలో ఉన్న ఫార్మా కంపెనీల్లో 50కు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదాల్లో చాలామంది మృతి చెందగా.. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రభుత్వం ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కార్మికులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.