AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ భూములు వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు
AP Government Reclaims Assigned Lands from Saraswati Power Industries: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంది . ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వం నిర్ణయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
అయితే, ఇటీవల సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. రైతులను బెదిరించి భూములను లాక్కున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతు కుటుంబానికి చెందిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని, సొంత ఆస్తిలో జగన్, షర్మిల ఆ భూముల కోసం గొడవపడుతున్నారని మండిపడ్డారు.
ఇందులో దాదాపు 34 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా కబ్జా చేసినట్లు పవన్ వివరించారు. అయితే కొంతమంది భూములు ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడ్డారని, ఏకంగా బాంబులతో సైతం భయభ్రాంతులకు గురిచేశారన్నారు. అలాగే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములను సుమారు 50 ఏళ్ల వరకు లీజు తీసుకుంటున్నట్లు ఓ జీఓ కూడా విడుదల చేశారన్నారు.