Revanth Reddy-Chandrababu Meet: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
Revanth Reddy-Chandrababu Meet: హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
రెండు కమిటీలు వేయాలని నిర్ణయం..(Revanth Reddy-Chandrababu Meet)
చర్చల అనంతరం మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు. విభజనకు సంబంధించిన కీలక అంశాలపై భేటీలో చర్చ జరిగింది. భద్రాచలం నుండి ఏపీలో కలిసిన 5 గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. ఎటపాక, గుండాల, కన్నాయ గూడెం, పిచ్చుకల పాడు..పురుషోత్తంపట్నం గ్రామ పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేందుకు..చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో కొన్ని భవనాలు కావాలని ఏపీ అడిగింది. అయితే.. స్థిరాస్తులను ఇచ్చే పరిస్థితి లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్లు తెలిసింది.అంతకుముందు ప్రజాభవన్ కు వచ్చిన చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సీఎంలు ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాళోజీ – నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు.