CM Revanth Reddy: ఒకసారి ఆలోచించండి.. సమ్మెకు వెళ్లకండి
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు.
కార్మికులకు ఏవైనా సమస్యలుంటే రవాణాశాఖ మంత్రితో చర్చలు జరపాలని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చెస్తుందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అందుకు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
మరోవైపు కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ విధానమని సీఎం అన్నారు. రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల కార్మికుల భాగస్వామ్యం మరువలేమని చెప్పారు. వారి మేలు కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. అలాగే సింగరేణి కార్మికులకు బోనస్ లు, ప్రమాద బీమాను అందిస్తున్నామని వివరించారు. అలాగే గల్ఫ్ కార్మికులు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రమాదవశాత్తు వారి చనిపోతే వారి మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించడమే కాకుండా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు సాయం చేస్తామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రూ. 8.15 లక్షల కోట్లు అప్పు చేసి పదవి దిగి పోయారని.. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే రూ. 1.58 లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలనలో అన్ని రకాల ప్రజలు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నామని చెప్పారు.