IPL 2025 : చెన్నై విజయ లక్ష్యం 156

IPL 2025 : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అధిపత్యం ప్రదర్శించి, పరుగల వరద పారించారు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లు తమ సత్తా చాటారు. భయంకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై వెన్ను విరిచారు. నూర్ అహ్మద్ 4 వికెట్లతో రాణించాడు.
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యారు. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై టీమ్‌ను కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (29), తిలక్ వర్మ (31) ఆదుకున్నారు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), నమన్ ధిర్ (17) పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో దీపక్ చాహర్ (15 బంతుల్లో 28) బౌండరీలతో విలువైన పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది.