IPL 2025 : బాదేసిన బట్లర్.. గుజరాత్ టైటాన్స్‌కు ఐదో విజయం

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం కొనసాగుతోంది. సొంతగడ్డపై శుభ్‌మన్ గిల్ సేన రెచ్చిపోయింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో బట్లర్ (97) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా బట్లర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ (43)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 119 పరుగులు జోడించడంతో ఐపీఎల్ చరిత్రలో రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా టేబుల్ టాపర్‌కు రెండో ఓటమి ఎదురైంది.
సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ పంజా..
సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ పంజా విసిరింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టుకు చెక్ పెట్టింది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్ (97 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు ప్రారంభంలోనే పెద్ద షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (7)ను కరుణ్ నాయర్ రనౌట్ చేశాడు. 14 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత సాయి సుదర్శన్ (36) అండగా జోస్ బట్లర్(97 నాటౌట్) ఢిల్లీ బౌలర్లను ఉతికి పరేశాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించి గుజరాత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.
ప్రమాదకరంగా మారుతున్న ద్వయాన్ని కుల్దీప్ విడదీశాడు. సుదర్శన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి రెండో వికెట్ అందించాడు. మిచెల్ స్టార్క్ వేసిన 15వ ఓవరులో రెచ్చిపోయిన బట్లర్ వరుసగా 5 ఫోర్లు బాది 20 పరుగులు చేశాడు. దాంతో గుజరాత్ గెలుపు వాకిట నిలిచింది. విజయానికి 11 పరుగుల దూరంలో రూథర్‌ఫొర్డ్ ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా (6) ఆఖరి ఓవరులో సిక్సర్ కొట్టాడు. తర్వాత బంతికి వైడ్ రూపంలో 5 పరుగులు వచ్చాయి. దాంతో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో ఐదో విజయం చేరింది.