MP Raghuramakrishnam Raju: వైఎస్ వివేకా హత్యకేసులో విజయ సాయిరెడ్డిని ఎందుకు విచారించడం లేదు.. ఎంపీ రఘురామకృష్ణం రాజు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని విచారించకపోవడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Viveka Murder case: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని విచారించకపోవడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని తొలుత పేర్కొన్నది విజయసాయి రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. వైయస్ వివేకా గుండెపోటుతో మరణించారని, విజయ సాయికి చెప్పింది ఎవరన్నది తేల్చాలన్నారు. వివేకా హత్య కేసు విచారణ రాష్ట్రం మారిన తర్వాత, విజయసాయిని విచారణకు పిలవాల్సి వస్తుందన్నారు. కడప ఎంపీ స్థానం కోసమే తన చిన్న నాన్న హత్య జరిగినట్లు వైయస్ షర్మిల స్పష్టంగా పేర్కొన్నారంటే, అది నిజమే అయి ఉంటుందని అన్నారు. మూడున్నర ఏళ్ళు అయినా తన చిన్నాన్న హంతకులను కనిపెట్ట లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ప్రజల్లో అనుమానాలు నెలకొనే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
మంత్రులపై జనసైనికులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు నివేదికను అందించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ ప్రచారం వెనుక పెద్ద ఎత్తున కుట్ర దాగిందని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను అడ్డుకోవడం జనసైనికులను వీర మహిళలను బయట తిరగకుండా నిలువరించడమే ఈ కుట్ర యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుందన్నారు. వారి సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరి మంత్రుల పై కోడి కత్తి దాడి తరహా దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలే జనసైనికుల మాదిరిగా మంత్రుల పై దాడి చేసే అవకాశం లేకపోలేదు అన్నారు. దానితో జనసైనికులను ఎక్కడికక్కడ నిర్బంధించి తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్లుగా గురి చేసే అవకాశం ఉందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రముఖ నాయకున్ని తిరగనివ్వకుండా పాలకులే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులకు రాష్ట్ర పోలీసుల రక్షణ కాకుండా కేంద్రంతో పవన్ కళ్యాణ్ మాట్లాడి సిఆర్ పిఎఫ్ పోలీసుల ద్వారా సెక్యూరిటీని కల్పిస్తే బాగుంటుందన్నారు. మంత్రుల పై దాడులు చేయాలనుకుంటుంది జగన్ సైనికుల జన సైనికుల అన్నది తేలనుందన్నారు.