Last Updated:

Somu Veerraju: ‘సోము‘తోనే సమస్యంతా తలెత్తిందా? ఏపీ బీజేపీలో అసమ్మతి స్వరాలు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ నేతల పట్ల, ఆయన వ్యవహరిస్తున్న తీరుపై, నాయకులు గుర్రుగా ఉన్నారట.

Somu Veerraju: ‘సోము‘తోనే సమస్యంతా తలెత్తిందా? ఏపీ బీజేపీలో అసమ్మతి స్వరాలు

Andhra Pradesh: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పార్టీలో ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ నేతల పట్ల.. ఆయన వ్యవహరిస్తున్న తీరుపై, నాయకులు గుర్రుగా ఉన్నారట. దీనికి తోడు, కాపులను పార్టీలో చేర్చుకుని, పార్టీ పుంజుకునేలా చేయాలన్న లక్ష్యంతో సోముకు పగ్గాలు అప్పగిస్తే, ఇప్పటివరకు ఒక్కరిని కూడా, ఆయన పార్టీలోకి తీసుకురాలేక పోయారన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందని సమాచారం. మరోవైపు, ఉన్నవారు కూడా అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నా, వారిని బుజ్జగించేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు సోము ఏమాత్రం ముందుకు రావడం లేదట.

ఇక తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన ఉన్నట్టుండి, బీజేపీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తుండటంతో  కాపు సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. పార్టీలో మిత్రుడిగా ఉన్న పవన్ వల్ల బీజేపీ పుంజుకుంటుందని, రెండు కలిసి 15 శాతం ఓటు బ్యాంకును అయినా సాధించాలని, చాలా మంది నాయకులు భావించారట. ముఖ్యంగా ఉభయ గోదావరిజిల్లాల్లో పుంజుకునేందుకు పవన్ ఫొటోను వాడుకోవాలని ప్లాన్‌ చేశారట. అయితే, ఆది నుంచి కూడా సోము వీర్రాజు ఎవరి మాటా వినడంలేదన్న టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో ఏపీ బీజేపీలో వర్గ పోరు కూడా బయటపడినట్లే అనిపిస్తోంది. సోము వీర్రాజు వల్లనే ఈ సమస్యంతా అని బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ బీజేపీకి దూరం జరుగుతున్నారు. రేపటి రోజున పొత్తు లేదు అని పవన్ కనుక చెబితే మాత్రం ఆ బాధ్యత అంతా సోము వీర్రాజునే అని కన్నా తనదైన మార్క్ విమర్శలు చేశారు. అలాగే,  బీజేపీ అధిష్టానం నుంచి వచ్చే సమాచారాన్ని తమకు ఇవ్వడంలేదని, పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని, కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్లు విమర్శించడం మరింత సంచలనంగా మారింది.

కన్నా లక్ష్మీనారాయణ హయాంలోనే బీజేపీతో జనసేన దోస్తీ కుదిరింది. ఆ తరువాత వచ్చిన సోము వీర్రాజు ఎందుకో పవన్‌ను పట్టించుకోలేదని బీజేపీలో ఒక వర్గం ఎప్పటి నుంచో గుస్సా అవుతోందని టాక్‌. బీజేపీలో ప్రొ వైసీపీ విధానాలు కొందరు నేతలు అమలు చేస్తున్నారు అన్న అసంతృప్తి కూడా నేతలలో ఉందిట. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఏవీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకురాకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల వల్లనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో విసిగచంద్రబాబుతో చేతులు కలిపారు అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అమరావతి రైతుల విషయంలోనూ ముందు ఒక రకంగా, తర్వాత ఒకరకంగా సోము స్టాండ్ మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామం కూడా పార్టీలోని చాలా మందికి నచ్చలేదట. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టిన రైతులకు మద్దతిద్దామని, కన్నా, పురందేశ్వరి, కామినేని వంటివారు సూచించినా, ఆయన పక్కన పెట్టారనే టాక్ ఉంది. ఈ క్రమంలో ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయం తెలుసుకుని, సోముకు క్లాస్ ఇచ్చారని తెలిసింది. దీంతో అప్పుడు ప్రకాశం జిల్లాలోకి చేరిన పాదయాత్రకు మద్దతుగా పాదం కదిపారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కూడా  జనసేన విషయంలో కలుపుకొని పోదామన్నా, సోము పట్టించుకోలేదనే విమర్శలులున్నాయి. జనసేనను పక్కన పెట్టి సొంత అజెండా అమలు చేశారని, సీనియర్లు గుర్రుగా ఉన్నారని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హఠాత్తుగా జనసేనానితో చంద్రబాబు భేటీ కావడంతో బీజేపీ నాయకులు కంగుతిన్నట్లు సమాచారం.

దీంతో ఏపీలో బీజేపీకి ఎటూ దారి లేక ఒంటరిది అయింది. దాంతో ఇపుడు పవన్ యాక్షన్ బీజేపీలో చిచ్చు రేపుతోంది. రేపటి రోజున ఏపీలో కమలం వికసించేందుకు దారేదీ అన్న చర్చ సాగుతోంది. అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సోము వీర్రాజు తనదే పెత్తనం అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు అన్నదే బీజేపీలోని సీనియర్ల మనో వేదన. అలాంటి అభిప్రాయలనే కన్నా లక్ష్మీ నారాయణ కూడా బయటపెట్టారు. అసలు బీజేపీలో ఏం జరుగుతోంది అన్నది తన లాంటి నాయకులకే తెలియడం లేదని, అంతా సోము వీర్రాజుతోనే సమస్యగా ఉందని కన్నా బాణాలు ఎక్కుపెట్టారు. అంతే కాదు బీజేపీ హైకమాండ్ ఈ విషయంలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. ఒక వైపు హై కమాండ్ పిలిచిందా లేక తానే వెళ్లారా తెలియదు కానీ సోము వీర్రాజు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కన్నా అసమ్మతి గళం విప్పారు. ఆయన బీజేపీలో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. దాంతో హై కమాండ్ సోము విషయంలో ఏమైనా సీరియస్ గా ఆలోచించి కొత్త నాయకత్వాన్ని ప్రకటిస్తుందా అన్నది చూడాలి. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో అన్ని పార్టీ కలసి ముందుకు అడుగులు వేయాలని కన్నా కోరడం విశేషం. అంటే ఏపీలో టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరాలన్నది బహుశా ఆయన అభిప్రాయం అయి ఉంటుంది అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే  కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే యోచనలో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత కన్నాకు బీజేపీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించలేదు. ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి కన్నా లక్ష్మీనారాయణలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారన్న టాక్‌ నడుస్తోంది. జనసేన పార్టీలో చేరాలనే యోచనలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని కన్నా లక్ష్మీనారాయణ కూడా ఖండించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇవి కూడా చదవండి: