Viral Video: లోకల్ ట్రైన్లో సీటు కోసం కొట్టుకున్న మహిళలు
రెండు కొప్పులు ఒకేచోట ఇమడలేవని, మహిళలు కలిసుండటం కుదరని పని అని పెద్దలు చెబుతుంటారు. ముంబై లోకల్ ట్రైన్ లె మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది.
Mumbai: రెండు కొప్పులు ఒకేచోట ఇమడలేవని, మహిళలు కలిసుండటం కుదరని పని అని పెద్దలు చెబుతుంటారు. ముంబై లోకల్ ట్రైన్ లె మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే ఈ సామెత నిజమే అనిపిస్తుంది. నవీ ముంబైలో ట్రైన్లో సీటుకోసం ముగ్గురు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మహిళలు ఒకరి పై ఒకరు దాడులకు దిగి ట్రైన్లో నానాబీభత్సం సృష్టించారు. వీరిని అదుపుచేయడానికి వచ్చిన మహిళా రైల్వే పోలీసు పై కూడా దాడిచేసి గాయపర్చారు.
తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్ ఎక్కారు. ట్రైన్లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరి పై ఒకరు చేయిచేసుకునేవరకు వెళ్లింది. అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు.
మహిళలు గొడవ పడుతుండటంతో అక్కడున్న మిగతా ప్రయాణికులకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దీంతో కొద్దిసేపు ట్రైన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి కూడా గాయాలయ్యాయి.