Bengaluru Floods: బెంగళూరు వర్షాలు.. పడవలు, ట్రాక్టర్లతో ఉద్యోగుల తరలింపు
బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి.
Bengaluru: బెంగళూరు నగర శివారులో భారీ వర్షాలు కురిసి నగరాన్ని ముంచెత్తడంతో పడవలను మోహరించారు. ఐటీ హబ్ ప్రాంతాలైన ఎలక్ట్రానిక్ సిటీ, మారతహళ్లి, ఔటర్ రింగ్ రోడ్, మహదేవపుర, వైట్‌ఫీల్డ్ మరియు బొమ్మనహళ్లి ప్రాంతాలు ఎక్కువగా వరదకు ప్రభావితమయ్యాయి. 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది నిపుణులు తమ కార్యాలయాలకు చేరుకోలేకపోయారు. నీరు నిలిచిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌లోని ప్రధాన కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని కోరాయి. రోడ్లు జలమయం కావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చింది.
పడవలు మరియు ట్రాక్టర్లు వరుసగా టెక్కీలు మరియు విద్యార్థులను వారి కార్యాలయాలు మరియు పాఠశాలలకు తీసుకువెళ్లడానికి ఉపయోగించారు. రెయిన్బో డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్స్ లేఅవుట్ మరియు సర్జాపూర్ రోడ్‌లోని కొన్ని ప్రాంతాలు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రయివేటు వాహనాల్లో వెళ్లేవారు సైతం గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వర్తూరులోని బలగెరె-పాణత్తూరు రహదారి నదిగా మారింది. ఆ ప్రాంతంలోని అపార్ట్మెంట్ల వాసులను పడవలతో తరలించారు. నీటమునిగిన రహదారి పై 23 ఏళ్ల మహిళ విద్యుదాఘాతంతో మరణించింది. పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తున్న అఖిల అనే యువతి ఇంటికి తిరిగి వస్తుండగా స్కూటర్ స్కిడ్ అయింది. విద్యుత్ స్తంభాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి షాక్‌కు గురైంది.
సోమవారం రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నగరంలో వరద పరిస్థితి పై సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, పాఠశాలలు వంటి దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరణ కు ఈ మొత్తాన్ని కేటాయించారు. బెంగళూరు కోసమే రూ.300 కోట్లు కేటాయించినట్లు బొమ్మై చెప్పారు. వివిధ జిల్లాల డిప్యూటీ కమిషనర్ల వద్ద ఇప్పటికే రూ.664 కోట్లు అందుబాటులో ఉన్నాయని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా రూ.500 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని బొమ్మై పేర్కొన్నారు.