Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఎన్నికల కమిషన్

Prashant Kishor: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీకి అధికారికంగా ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ (ఈసీ) కేటాయించింది. ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’ను కేటాయించింది. ఈ గుర్తుపైనే బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పోటీ చేయనుంది. ఈసీ నిర్ణయంపై పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణలు, సమ్మిళిత అభివృద్ధి ద్వారా సామాజిక ఉద్ధరణ సాధించాలనే పార్టీ లక్ష్యానికి అనుగుణంగా గుర్తు ఉందని తెలిపారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరుతెచ్చుకున్నారు. ఆయన 2024 అక్టోబర్ 2న జనసురాజ్ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల తర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. ప్రశాంత్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేండ్ల పాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు గత నెలలో ప్రశాంత్ ప్రకటించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్, నవంబర్ 2020లో జరిగాయి. ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ సీఎంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత 2022 ఆగస్టులో నితీష్ సారథ్యంలోని జేడీయూ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుంది. అనంతరం ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్ బంధన్‌తో కలిసి సర్కారును ఏర్పాటు చేసింది. 2024 జనవరిలో మహాఘట్ బంధన్‌కు నితీష్ ఉద్వాసన చెప్పి, తిరిగి ఎన్డీయేతో చేతులు కలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారులో తిరిగి నితీష్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.