LoC Ceasefire: కవ్విస్తున్న పాక్.. కాల్పుల విరమణకు తూట్లు

Pahalgam: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. వరుసగా రెండో రోజు భారత పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్లుల్లో ఎవరూ గాయపడలేదని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్‌మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26మంది పౌరులు ప్రాణాలు విడిచిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో భారత్ పోస్టులపై కాల్పులు జరుపుతుంది.
పాకిస్థాన్ చేస్తు్న్న కాల్పులకు భారత బలగాలు ధీటుగా సమాధానం చెబుతున్నాయి. ఎల్ఓసీ అంతా ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత్ చర్యలకు పూనుకొంది. పుహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తీసుకున్న చర్యలను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే బైసరన్ గడ్డి మైదానంలో పర్యటిస్తున్న టూరిస్టులను టార్గెట్ చేసి కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఈఘటనలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)తో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) పాలుపంచుకున్నట్లు ప్రకటించింది. ఇందులో ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాదులు ఉండగా మరో ఇద్దరు జమ్మూకు చెందినవారు. 26/11 దాడికి సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హస్తం పహల్గాంలో ఉన్నట్లు స్పష్టమైంది.
పాకిస్థాన్ సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపేవరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. దీంతో పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కుతోంది. అయితే పాక్ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక వైపు చర్చలకు సిద్దమంటూనే మరోవైపు భారత పోస్టులపై కాల్పులు జరిపిస్తున్నారు. భారత్ మాత్రం లోతుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ బీహార్ వేధికగా తీవ్రవాదులను, వారివెనకుండి నడిపిస్తున్నవారిని వదిలిపెట్టేదిలేదన్నారు.