Shashi Tharoor On PM: ప్రధాని మోదీపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor Appriciate To PM Modi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన శక్తి, చైతన్యమే ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రధాన ఆస్తిగా మిగిలిపోయాయని ప్రశంసలు కురిపించారు. కానీ దానికి మద్దతు అవసరం అని తెలిపారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ దురాక్రమణపై ప్రచారం, ప్రపంచ వేదికపై భారత్ ఐక్యతను చాటి చెప్పిందన్నారు. ఐక్యత శక్తి, స్పష్టమైన కమ్యూనికేన్, సమర్థత, వ్యూహాత్మక విలువలు భారత్ ను అంతర్జాతీయంగా ఎంతో ఎత్తులో నిలబెట్టాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్ న్యాయమైన, సురక్షితమైన, సంపన్నమైన ప్రపంచం కోసం ఎప్పటికీ ప్రయత్నిస్తుందని శశిథరూర్ అన్నారు. అలాగే టెక్నాలజీ, ట్రేడింగ్, ట్రెడిషన్ అనే మూడు టీలు భారతదేశ భవిష్యత్తు ప్రపంచ వ్యూహాన్ని నడిపించాలని తెలిపారు. ఉగ్రవాదంతో పాకిస్తాన్ కు ఉన్న నిరంతర సంబంధం ప్రపంచవ్యాప్త ప్రచారంలో కీలకమైన అంశం అని చెప్పారు. అమెరికాలో తన ప్రతినిధి బృందం చేసిన ప్రచారాన్ని గుర్తు చేసుకుంటూ.. పాకిస్తాన్ అధికారులపై శశిథరూర్ విమర్శలు చేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కోసం ఐదు దేశాల్లో పర్యటించి ఇటీవలే ఆయన దేశానికి తిరిగివచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోదీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.