Hyderabad MLC Election: 22 ఏళ్ల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక.. 63 ఓట్లతో ఎంఐఎం గెలుపు!

MIM Candidate wins Hyderabad Local Body MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి హసన్ 63 ఓట్లతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావుకు 25 ఓట్లు పడగా.. ఎంఐఎం అభ్యర్థి మీర్చా రియాజ్ ఉల్ హసన్‌కు 63 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ, ఎంఐఎం పార్టీలు పోటాపోటీ ప్రచారం చేశాయి. అయితే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బహిష్కరించగా.. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మాత్రమే పోటీ చేశాయి.
అంతకుముందు హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్లు కౌంటింగ్ చేపట్టారు. అభ్యర్థుల సమక్షంలో బ్యాలెన్ బాక్స్‌లను ఎన్నికల సిబ్బంది తెరిచారు. అనంతరం ఓట్లను లెక్కించారు. అయితే, ఈ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 22 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సడెన్‌గా రంగంలోకి దింపడంతో ఈ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇందులో మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఎంఐఎం పార్టీకి ఓట్లు ఉండగా.. తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది. ఓటర్లలో ఎంఐఎం పార్టీకి 49 ఓట్లు ఉండగా.. మిగతా ఓట్లు ఇతర పార్టీల నుంచి మద్దతు లభించింది. అయితే మొత్తం 112 ఓట్లకు గానూ 88 ఓట్లు పోలయ్యాయి.
ఇదిలా ఉండగా, మొత్తం 81 మంది కార్పొరేటర్లు ఉండగా, 31 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్ఎష్ పార్టీలకు ఎక్స్ ఆఫీషియో సభ్యులు 9 మంది చొప్పున ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలకు ఆరు చొప్పున ఉన్నారు.