BRS: KTRపై కేసు.. తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు

Telangana: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ( నవీన్ ) కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్టేషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తనపై మల్లన్న వేసిన పరువు నష్టం కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షతోనే మల్లన్న కేసు పెట్టారని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో మల్లన్నకు న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలు రూపొందించి పూకార్లు పుట్టించారని మల్లన్న గతేడాది మే నెలలో పరువునష్టం దావా వేశారు. మల్లన్న ఫిర్యాదుతో కేటీఆర్, జగదీష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని మల్లన్న నిరాధారమైన ఆధారాలతో తనపై ఫిర్యాదు చేశారని కేటీఆర్ పిటిషన్ వేశారు.
పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ కక్షతోనే ఫిటిషన్ వేశారని కేటీఆర్ తరపు న్యాయవాది టి.వి. రమణరావు వాదనలు వినిపించారు. ఎవరిమీదా కేటీఆర్, జగదీష్ రెడ్డిలు తప్పుడు ఆరోపణలు చేయలేదన్నారు. మల్లన్న చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని చెప్పారు. దీంతో న్యాయమూర్తి మౌసమీ భట్టాచార్య మల్లన్నకు నోటీసులు జారీచేశారు. కేసును జూన్ 13కు వాయిదా వేశారు.