Last Updated:

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ టూర్.. వైసీపీ నేతల్లో ఒకటే టెన్షన్..

విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జనను చేపట్టనుంది నాన్ పొలిటికల్ జేఏసీ.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ టూర్.. వైసీపీ నేతల్లో ఒకటే టెన్షన్..

Andhra Pradesh: విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జనను చేపట్టనుంది నాన్ పొలిటికల్ జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను రాజధానిగా బదలాయించడానికి తాము స్వాగతిస్తోన్నామని స్పష్టం చేసింది. ఎల్‌ఐసీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. నాన్ పొలిటికల్ జేఏసీ వెనక వైసీపీ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే.

విశాఖ గర్జన పై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌ను అందుకున్నారు. దేనికి గర్జనలు అంటు ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌పై వరుస పోస్టులు పెట్టారు. మూడు రాజధానులతో రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాటానికా ఈ గర్జనలు అంటూ పవన్‌ ప్రశ్నించారు. ట్వీట్లు చేయడం వరకే పరిమితం కాలేదు పవన్ కల్యాణ్. ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. దీనికి అవసరమైన షెడ్యూల్‌ను కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. జనసేన – జనవాణి కార్యక్రమాన్ని కూడా ఇందులోనే పొందుపరిచింది. మూడు రోజుల్లో మూడు ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలను చుట్టేయబోతోన్నారు. పార్టీ నాయకులతో విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొనబోతోన్నారు. 16,17 తేదీల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటిస్తారు. 16వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 17వ తేదీన శ్రీకాకుళంలో పార్టీ నాయకులతో సమావేశమౌతారు పవన్‌ కల్యాణ్‌. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ర్యాలీగా ఆయన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. ఒక వంక విశాఖ గర్జన ఆందోళనను ప్రతిపాదించిన రోజే పవన్ కల్యాణ్ అదే విశాఖలో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ తలపెట్టిన ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్ని రోజులు హైదరాబాద్‌లో ఉంటూ విశాఖ గర్జనను నిర్వహించ తలపెట్టిన రోజే పవన్ కల్యాణ్ రోడ్డెక్కుతున్నారని, దీని వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. మూడు రాజధానులను అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఆయన ఈ పర్యటనకు పూనుకున్నారని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ధ్వజమెత్తుతున్నారు వైసీపీ నేతలు. విశాఖ గర్జనకు పోటీగా పవన్ కల్యాణ్ వస్తున్నారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు పేకలో జోకర్ అని ధ్వజమెత్తారు. జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ వాయిదా వేసుకోవాలన్నారు. లేకపోతే ప్రజలు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై మీ వైఖరి చెప్పాల్సిందేనని, ప్రజల దృష్టిని మళ్లించడానికే పవన్‌ పర్యటన అని మంత్రి అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వస్తే ఆయన అభిమానులు, జనసేన నేతలు పెద్ద ఎత్తున హంగామా చేసే అవకాశం ఉంది. విశాఖ సిటీలో జనసేనకు మంచి క్యాడర్ ఉంది. ముగ్గురు కార్పొరేటర్లు కూడా గెలిచారు. పవన్ కల్యాణ్ ఇలా విశాఖ వస్తే గర్జనను డామినేట్ చేసే అవకాశం ఉందని అందుకే ఆయన రావొద్దని, పర్యటనను వాయిదా వేసుకోవాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ జనవాణిని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, రాజమండ్రి, తిరుపతిల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక విశాఖే మిగిలింది. అక్కడ కూడా నిర్వహించాలని తేదీ ఖరారు చేసుకోవడం, అది విశాఖలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న గర్జనతో క్లాష్ కావడంతో టెన్షన్ ప్రారంభమయింది.

అయితే, విశాఖ గర్జనను విజయవంతం చేసే బాధ్యత తీసుకున్న గుడివాడ అమర్‌నాథ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. తన గర్జనకు జనాలు వస్తారా రారా అనే టెన్షన్ ఒకటి అయితే, పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు భారీగా తరలి వస్తే, వారి ముందు తన పరువు పోవడం ఖాయమని ఆందోళన చెందుతున్నారట. తన గర్జన కార్యక్రమం నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన విశాఖ వస్తున్నారని మండిపడుతున్నారు. అందుకే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శల డోసు పెంచారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌ పై గుడివాడ అమర్నాథ్ ఇటీవలి కాలంలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన పై జనసైనికులు కూడా సోషల్ మీడియాలో అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏదైనా ప్రశ్నిస్తే ప్రతీ సారి వ్యక్తిగతంగా, విమర్శలు చేస్తున్నారని, కానీ పాలసీల పరంగా మాట్లాడటం లేదని జనసేన నేతలు మండి పడుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ మూడు రాజధానుల విషయంలో తన వాదన బలంగా వినిపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. నిజానికి చాలామంది వైసీపీ నేతలు గతంలో మద్దతు ప్రకటించారు. వారు మాట మార్చారు. పవన్ మార్చలేదు అదే తేడా. అయినా సరే వీరంతా పవన్ కల్యాణ్‌ పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉన్నారు. చివరికి విశాఖ పర్యటనకు రావొద్దని బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద అక్టోబర్‌ 15న విశాఖలో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి: