Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌తో పాటు.. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు మెల్లిమెల్లిగా ముందుకుసాగుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Hyderabad:
హైదరాబాద్‌లో మరోసారి వాన దంచికొట్టింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్, యూసఫ్ గూడ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, అంబర్‌పేట్, కాచిగూడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
నగరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. చెరువులను తలపించేలా మారిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.వర్షం కారణంగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో.. వాహనదారులు నరకం చూశారు. ఐటీ కారిడార్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, కేబుల్ బ్రిడ్జి మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
———-
అత్యవసరమైతేనే బయటకు..(Hyderabad)
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే ఆరుబయట అడుగు పెట్టాలని అధికారులు కోరారు.ఉరుములతో కూడిన భారీ వర్షం హెచ్చరిక* GHMC హైదరాబాద్ ప్రాంతాల్లోని ప్రజలు అనవసర ప్రయాణాలను నివారించాలని మరియు అవసరమైతే మాత్రమే ఆరుబయట అడుగు పెట్టాలని అభ్యర్థించారు. Drf బృందాలు అప్రమత్తంగా ఉంటాయి మరియు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, పౌరులు సహాయం కోసం 040-21111111 లేదా 9000113667కు డయల్ చేయవచ్చు అని GHMC డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (EV&DM) ఒక ట్వీట్ లో తెలిపింది.