Odela 2 Movie Review: ఓదెల 2 రివ్యూ.. అదిరిపోయిన తమన్నా ఎంట్రీ.. సీక్వెల్ ఎలా ఉందంటే..?

Odela 2 Movie Review: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఓదెల 2”. ఈ సినిమాని అశోక్ తేజ డైరెక్షన్‌లో, సంపత్ నంది డైరెక్షన్ సూపర్‌విజన్‌లో రూపొందించారు. మధు అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించగా, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఓదెల 2.. ఓదెల రైల్వే స్టేషన్ కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతుంది. ఊరిలో ఎంతోమంది కొత్తగా పెళ్లయిన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)ను రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపేస్తుంది. దీంతో ఆమె జైలు పాలవుతుంది. అయితే, ఊరివాళ్లందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఊరిలో మళ్లీ పెళ్లయిన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి.
అయితే, దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్, మయన్న అని అనుకుని వాళ్లను శిక్షించడానికి సిద్ధమైతే, తిరుపతి ఆత్మ కారణమని చెబుతాడు ఊరిలో తాయత్తులు వేసే అల్లా భక్షు (మురళీ శర్మ). దీంతో ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్లీ రాధను కోరతారు ఊరివాళ్లు. ఇది నా వల్ల కాదని, తన అక్క, ఇప్పుడు అఘోరీగా మారిన భైరవి (తమన్నా) వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో, ఆ ఊరివాళ్లు ఆమెను వెనక్కి తీసుకుని వస్తారు. మరి ఊరిని తిరుపతి బారి నుంచి భైరవి కాపాడిందా? రాధ ఎలా మరణించింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
నిజానికి ఈ సినిమా కథ ఏమిటనే విషయం ప్రమోషన్స్‌లోనే అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాక్షసుడిగా మారి, ఊరి ఆడపిల్లల మీద పడి, రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత, అతనికి ఊరు విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారతాడు. ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది? అతని దారుణాల వల్ల ఊరి వారందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు? ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ విషయాల చుట్టూ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆద్యంతం కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది.
ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు. కేవలం కథను బిల్డ్ చేసుకునేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు దర్శకుడు. అయితే, తమన్నా ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఇక ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి.
కానీ, క్లైమాక్స్ రాసుకున్న తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇది కూడా కొత్తగా అనిపించకపోవచ్చు, కానీ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు మేకర్స్. అందులో దాదాపు సఫలమయ్యారు. ఓవరాల్‌గా చూస్తే, ఫస్ట్ హాఫ్ అంత ఆకట్టుకునే కిక్ ఇవ్వకపోయినా, తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో డైరెక్షన్ టీమ్ సక్సెస్ అయింది. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.