Pelli Kaani Prasad Movie Review: పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ.. నవ్వులు పండించిందా..!

Pelli Kaani Prasad Movie Review: కమెడియన్ సప్తగిరి నటించిన లేటెస్ట్ మూవీ పెళ్లి కాని ప్రసాద్. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించగా.. కేవీబాబు(విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మాతలుగా వ్యవహిరించారు. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పణలో ఎస్వీసీ విడుదల చేసింది. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం వహించగా.. మధు ఎడిటర్‌గా, డీఓపీ సుజాత సిద్దార్థ్ వ్యవహరించారు. తాజాగా, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
మలేషియాలో ఒక స్టార్ హోటల్‌లో ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తుంటాడు. అయితే తన తండ్రి (మురళీధర్) తమ పూర్వీకుల కట్నం విషయంపై 38 ఏళ్ల వయసులో అతని వద్ద ప్రస్తావన తీసుకొస్తాడు. ఇందులో రూ. 2 కోట్లు తక్కువైతే వివాహం చేసుకోకూడదని చెప్పిన మాటలను అనుసరిస్తూ అలాంటి సంబంధం కోసం చూస్తూంటాడు. అయితే రూ.2 కోట్లు కట్నం ఇస్తే చాలని అనుకుంటున్న తరుణంలో అదే గ్రామంలో ప్రియ ( ప్రియాంక శర్మ)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె తన తల్లిదండ్రులు, అమ్మమ్మతో కలిసి విదేశాల్లో సెటిల్ కావాలనేది ఆమె జీవిత ఆశయంగా పెట్టుకుంటుంది. ఈ సమయంలో ప్రసాద్ గురించి తెలుసుకొని అతడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. కానీ ప్రసాద్ మాత్రం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకోవడంతో ఇద్దరి మధ్య సమస్యలు మొదలవుతాయి. ఇదే విషయంపై ఇద్దరూ గొడవపడతారు. అయితే ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్లొద్దని అనుకున్నాడు? చివరికి పెళ్లికాని ప్రసాద్ పెళ్లి చేసుకున్న ప్రసాద్ అయ్యాక ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి ఏం జరిగింది? అనేది ఈ సినిమాను చూస్తే అర్థమవుతోంది.
నటీనటులు:
ఈ సినిమాలో సప్తగిరి మొత్తం బాధ్యతలు తనే నిర్వహించాడు. వన్ మాన్ ఆర్మీగా అందరినీ నవ్వించాడు. ఒకవైపు వయసు పెరుగుతుండగా.. మరోవైపు పెళ్లి కాకపోవడం, తండ్రిని ఎదురించలేక ఇబ్బంది పడుతున్న ఓ యువకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడటం, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె తనను కాకుండా తన ఫారెన్ ఉద్యోగాన్ని చూసి ప్రేమించిందని తెలుసుకుని బాధపడే పాత్రలో ఇమిడిపోయాడు. అదే విధంగా ఎక్కువగా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర మురళీధర్ గౌడ్ చేశాడు. ఆయన ఇప్పటికే పోలి సినిమాలతో రుజువు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమాలోనూ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అలాగే అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ తన యాక్టింగ్‌లతో మెప్పించారు.
టెక్నికల్:
ఈ సినిమాలో శేఖర్ చంద్ర అందించిన పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఆకట్టుకున్నాయి. ప్రధానంగా చాలా సీన్స్‌లో ఇప్పటికే ట్రెండ్ కి తగ్గట్టుగా ఉపయోగించిన మీమ్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక, సినిమాటోగ్రఫీ విషయానికోస్తే చాలా రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఇంట్రడక్షన్ పాటతో పాటు ఇతర పాటట్లోనూ చిత్రీకరణ చాలా బాగుంది. అక్కడక్కడ డైలాగ్స్ నవ్వించడంతో పాటు కొంత ఆలోచన చేసే విధంగా ఉన్నాయి. వాస్తవానికి సినిమాలో మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకుడు నవ్వించడామే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథ పెద్దగా ఆకట్టుకునేలా లేకున్నా.. స్టోరీకి తగిన విధంగా కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
విశ్లేషణ:
ఇప్పటివరకు వచ్చిన సినిమాలు చాలా వరకు వివాహం చుట్టూ తిరిగేలా కథ కొనసాగడం చూశాం. అయితే ఈ సినిమాలో కూడా దాదాపు అదే కోణంలో కొనసాగుతోంది. పెళ్లి చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఓ కుర్రాడిని కేవలం అతడు చేస్తున్న ఉద్యోగం చూసి పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లి అక్కడే సెటిల్ కావాలనుకునే అమ్మాయి పెళ్లి చేసుకోవడం, ఆమె వారి ఫ్యామిలీతో కలిసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అసలు ఫారిన్ వెళ్లడు అని తెలిసి ఏం చేశారు? అనే లైన్‌తో ఈ సినిమా రూపొందించారు. కథ కొత్తగా అనిపించకపోయినా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే కొన్ని చోట్ల కామెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించిన మరికొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది. అయితే క్లైమాక్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండేది.
పంచ్ లైన్ : పెళ్లి కాని ప్రసాద్ కష్టాలు నవ్విస్తాయి