Mandous Cyclone: బలహీన పడిన “మాండూస్”.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Mandous Cyclone: గత రెండు రెండు మూడు రోజులుగా ఏపీలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడింది. ఈ మేరకు తాజా వెదర్ రిపోర్టును ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ముందు నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రోజూ తాజా వాతావరణ అప్డేట్స్ పై సమీక్షలు నిర్వహిస్తూ దానికి అణుగుణంగా అమలు చేయాల్సిన విధి విధానాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మాండూస్ కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి నగరాన్ని తుపాన్ ముంచెత్తింది.
మాండూస్ తుఫాను ప్రభావం తెలంగాణలో మోస్తరుగా ఉంది. హైదరాబాద్‌లో వాన కురుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఈ ప్రభావంతో రాత్రి నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో వాన ముసురు పెట్టింది. బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, సనత్‌నగర్, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్ వనస్తలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అయితే రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తో కలిసి తుపాను కదలికలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేశామని సాయి ప్రసాద్ తెలపారు. తుఫాను ఉద్రిక్తతను కచ్చితంగా అంచనా వేయడంతోపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నష్ట తీవ్రతను తగ్గించగలిగామని ఆయన చెప్పారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటి మందికి పైగా సబ్ స్క్రైబర్లకు ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపించామని వెల్లడించారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో మాండూస్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మాండూస్ తుఫాన్ ప్రభావం.. శ్రీవారి మెట్లమార్గం మూసివేత