Formula-E race case: ఏసీబీ ఆఫీస్ వద్ద హైడ్రామా.. లాయర్లకు నో ఎంట్రీపై కేటీఆర్ అభ్యంతరం!
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి అనుమతి నిరాకరించడంతో కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఏసీబీని కోరాడు.
ఏసీబీ అధికారుల స్పందన కోసం కేటీఆర్ దాదాపు 45 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీసు ముందు చూశారు. లాయర్లను అనుమతించకపోతే తిరిగి ఇంటికి వెళ్లిపోతానని కేటీఆర్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా క్వాష్ పిటిషన్ కోర్టులో ఉందన్నారు. లాయర్లను లోపలికి అనుమతి ఇస్తేనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. అనంతరం ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు.
పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసని,ఆయన చెప్పని దానిని వాంగ్మూలంగా చూపి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అక్రమ వ్యవహారాలు ఇలానే ఉంటాయని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు చేశారు. అందువల్లే న్యాయవాదులను లోపలికి అనుమతి ఇస్తేనే హాజరవుతానన్నారు. అయినా లాయర్‌తో వస్తే ఇబ్బంది ఏంటని నిలదీశారు.
చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తుందన్నారు. గతంలో నరేందర్ రెడ్డిని కూడా విచారణ పేరుతో పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్‌ని మీడియాకి పంపించారన్నారు. నా విషయంలో అలా జరగకూడదనే లాయర్‌తో వచ్చానని వెల్లడించారు.
కాగా, న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని లాయర్ సోమ భరత్ అన్నారు. అనంతరం ఏసీబీ తీరును కేటీఆర్ లాయర్ సోమ భరత్ తప్పుబట్టారు. న్యాయవాదిని వెంట తీసుకెళ్లడం రాజ్యాంగబద్ధ హక్కు అన్నారు. చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉంటాయన్నారు. ఏసీబీ ఏసీపీకి లిఖితపూర్వక స్టేట్ మెంట్ ఇచ్చి కేటీఆర్ వెనుదిరిగారు. నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పోలీసులపై నమ్మకం లేదని, అందుకే ఏసీబీ విచారణకు వచ్చానని వివరణ ఇఛ్చారు.
రేవంత్ ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని కేటీఆర్ చెప్పారు. రాజ్యాంగంపై ఉన్న గౌరవంతోనే విచారణకు వచ్చానని, 420 హామీలు అమలు చేసే వరకు కొట్లాడుతామన్నారు. నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారన్నారు. పోలీసులు దొంగ స్టేట్ మెంట్ సృష్టించారన్నారు. అయితే తీర్పు రిజర్వ్‌లో ఉండగా.. ఈ డ్రామాలు ఎందుకు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలను నా ఇంట్లో పెట్టి నన్ను ఇరికించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఫార్ములా ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. సమాచారం అంతా ఏసీబీ దగ్గరే ఉందని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని, ఇటీవల అల్లు అర్జున్ కేసు పేరిట డ్రామాలు ఆడారన్నారు.