News Click : ప్రముఖ న్యూస్ పోర్టల్ “న్యూస్‌క్లిక్” ఆఫీస్, ఉద్యోగుల ఇళ్ళలో పోలీసుల సోదాలు.. కారణం ఏంటంటే ?
ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రముఖ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ "న్యూస్‌క్లిక్" కి సంబంధించిన ఆఫీస్, జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తాజాగా సోదాలు చేపట్టింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
News Click : ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రముఖ ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ “న్యూస్‌క్లిక్” కి సంబంధించిన ఆఫీస్, జర్నలిస్టుల ఇళ్లపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తాజాగా సోదాలు చేపట్టింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద సదరు సంస్థపై కేసు నమోదు చేసింది.
చైనాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ కార్యాలయంతో పాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసం జరిగిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. కాగా, చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్ లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.