Vijayawada: ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనం కుదరదు.. దేవాదాయ శాఖను రద్దు చేయాల్సిందే
All Set for Haindava Sankharavam in Vijayawada: హిందూ దేవాలయాల పెత్తనం నుంచి ప్రభుత్వాలు వెంటనే తప్పుకొని, ఆ బాధ్యతలను ఆయా దేవాలయాల ధర్మకర్తలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఆదివారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ‘హైందవ శంఖారావం’పేరిట విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో బాటు పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధుసంతులు, విశ్వహిందూపరిషత్ నేతలు, బీజేపీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అధికారుల పెత్తనమా?
దేవాదాయ శాఖ అధికారుల చేతుల్లో దేవాలయ వ్యవస్థ మొత్తం సర్వనాశనమైపోతోందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. గతంలో ఆలయాలకు ఉన్న 15 లక్షల ఎకరాల మాన్యాలు నేడు మంచుమాదిరిగా కరిగి, నేడు 4.50 లక్షల ఎకరాలకు పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయానికి అవసరమైన నిర్ణయాలన్నీ దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్నారని, చివరకు ఎంత సేపు పూజచేయాలి? ఏ పూజ చేయాలో కూడా వారే నిర్ణయించే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో జరిగే ఆరాధనలు, సంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆలయాలను నిర్మించుకున్న వ్యక్తులకు ఆ ఆలయాన్ని నిర్వహించటం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
అందుకే మతమార్పిడులు..
ఆలయ కమిటీలలో నేతలకు భాగస్వామ్యం పనికిరాదని, ఆలయాలపై నాయకుల పెత్తనం ఇక కుదరదని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. దేవుడి వద్ద వీఐపీ దర్శనాలేంటి? తిరుపతి వంటి ఆలయాల్లో ధనవంతులకు వీఐపీ దర్శనాలు, పేదలకు రోజుల తరబడి పడిగాపులేంటి? అని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని అన్నారు. దేవాలయాలు కోల్పోయిన ఆలయ భూములు, ఇతర ఆస్తులు తిరిగి వాటికే దక్కేలా చేయటానికి తగిన ప్రయత్నం జరగాలని, అదే జరిగితే ఇక.. టిక్కెట్లతో పని ఉండదని సూచించారు. హిందూ సమాజమే తన ఆలయాలను తిరిగి శక్తి కేంద్రాలుగా, సామాజిక కేంద్రాలుగా మార్చుకోవాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
దేవాదాయ శాఖే వద్దు
హిందువులు నిర్మించుకున్న ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం కుదరదని, కనుక దేవాదాయ శాఖనే రద్దుచేయాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామిజీ డిమాండ్ చేశారు. సినిమా హాళ్లలో మాదిరి కౌంటర్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకునే దుస్థితికి దేవాలయాలను తీసుకొచ్చారని ప్రభుత్వాల మీద మండిపడ్డారు. దేవాదాయ , ధర్మాదాయ శాఖ అనే ఆలోచనే పరమ దుర్మార్గమైనదని వివరించారు. ప్రభుత్వమే దేవాలయాల భూములను కబ్జాచేసి ప్రభుత్వ కార్యాలయాలు,గోడౌన్లు నిర్మించిందని విమర్శించారు. దేవాలయంలో ఒక దేవుడుంటే 20 హుండీలు ఎందుకు పెడుతున్నారు? హుండీలు పెట్టి భక్తులను దోచుకుంటారా? అని ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ , ధర్మాదాయ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని కమలానంద భారతీ స్వామీజీ డిమాండ్ చేశారు. దశావతారాల్లో ఏడు అవతారాల ఆలయాలున్నది ఆంధ్రప్రదేశ్‌లోనని, ఈ ఏడు ఆలయాలను కలుపుతూ ఒక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.