TS High Court: బెనిఫిట్ షోలు రద్దంటూ.. ప్రత్యేక షోలకు అనుమతి ఎందుకు? – ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
HC Upset on Special Shows For Movies: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు, బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రం టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పటిషన్పై శుక్రవారం(జనవరి 10న)హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రాలకు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతి నిరాకరించింది. పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతిని ఇవ్వలేదు, కానీ తెల్లవారుజామున ప్రత్యేక షోలకు మాత్రం అనుమతిని ఇచ్చింది. దీనిపై జనవరి 8న పిటిషన్ దాఖలైంది. నేడు ఈ పిటిషన్ను విచారించిన తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలను రద్దు చేశామంటూ.. పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున:సమీక్షించాలని హోంశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. “ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని, భారీ బడ్జెట్తో నిర్మాతలు సినిమాలు తీసి ప్రేక్షకులు నుంచి వసూళ్లు చేసుకోవడం సరైన పద్దతి కాదు” అని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై తదుపరి విచరాణ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.