Puri Jagannath: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర

Jagannath Rath Yatra: ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంట సాగనుండగా.. జగన్నాథుని భారీ రథయాత్ర ఆలయ ప్రాంగణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి చేరుకోనుంది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలకు సుమారు 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేసి.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
జగన్నాథుని రథయాత్ర నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఏకంగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు. అలాగే 10 వేల మంది జవాన్లను సర్కార్ నియమించింది. భూ, జల, వాయు మార్గాలపై నిఘా ఉంచినట్టు ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా వెల్లడించారు. అలాగే భద్రతతో పాటు వైద్య సేవలు కూడా భక్తులకు అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. రథయాత్ర సందర్భంగా 69 తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, 64 అంబులెన్స్ లు, 265 స్పెషల్ హాస్పిటల్ బెడ్స్, 378 అదనపు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది డ్యూటీలో ఉండనున్నట్టు తెలిపారు. ఏఐఎమ్ఎస్ భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా పూరీలో రథయాత్ర వద్ద విధులు నిర్వహించనున్నారు. యాత్రను ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.