Jagannath Rath Yatra: పూరి జగన్నాథ రథయాత్రలో ముగ్గురు మృతి

Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జగన్నాథుని రథం నంది ఘోష్ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున 4- 5 గంటల మధ్య తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు ఆలయం సమీపంలోకి చేరుకోగానే, పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు అకస్మాత్తుగా పడిపోయాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. కొందరు భక్తులు రథ చక్రాల కింద పడిపోయారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు ఒడిశాలోని ఖోర్దా జిల్లాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. మృతులు ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42) గా గుర్తించినట్టు పూరి జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రథంపై ఉన్న స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని.. వెంటనే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే రద్దీగా భక్తుల నడుమ చెక్క దుంగలను తీసుకెళ్లే రెండు ట్రక్కులు అక్కడికి వచ్చాయని.. దీంతో తొక్కిసలాటకు దారి తీసిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఒడిశా న్యాయశాఖ మంత్రి హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత స్థాయి విచారణ చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.